ఏం తెగింపురా : డివైడర్ పై బైక్ రైడింగ్.,.

ఏం తెగింపురా : డివైడర్ పై బైక్ రైడింగ్.,.

బండి అంటే రోడ్డుపై వెళుతుంది.. రోడ్డు మధ్యలో కూడా వెళుతుంది.. రోడ్డుకు అటూ ఇటూ కూడా డ్రైవ్ చేయొచ్చు.. వీడు మాత్రం మరింత వెరైటీ.. మరింత తెగించేశాడు.. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పైనుంచి బైక్ రైడింగ్ చేశాడు.. అది కూడా నదిపై ఉన్న బ్రిడ్జిపై ఉన్న డివైడర్ పైకి ఎక్కి మరీ బండి నడిపాడు.. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఎట్రాక్ట్ చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ నెల 23న పెరుంబిడుగు ముత్తురైయార్‌ జయంతి సందర్భంగా ఆ సంఘానికి చెందిన పలువురు యువకులు తిరుచ్చిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ యువకుడు నిబంధనలకు విరుద్ధంగా బైక్‌పై స్టంట్స్‌ చేశాడు. కొల్లిడం నది వంతెనపై రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌పై తన మోటార్‌బైక్‌ను ప్రమాదకరంగా నడుపుతూ కనిపించాడు. దీంతో పాటు మరికొందరు యువకులు కూడా అతడికి మద్దతుగా కేకలు వేస్తూ ద్విచక్ర వాహనాలను అతివేగంతో నడుపుతున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన పోలీసుల దృష్టికి వచ్చింది.

తిరుచ్చిలోని కొల్లిడం నది వంతెనపై ఉన్న డివైడర్‌పై , బైక్ స్టంట్‌ను ప్రదర్శించిన వ్యక్తి హెల్మెట్ కూడా ధరించలేదు.  నిబంధనలను ఉల్లంఘిస్తూ బైక్​ అత్యంత ప్రమాదకరంగా డ్రైవ్​ చేశాడు. . ఆ సమయంలో రోడ్డుపై రద్దీ కూడా లేదు. అయినా ఆ యువకుడు అలా ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు, భయబ్రాంతులకు గురి చేశాడు. అటుగా వెళ్తున్న స్థానికులు యువకుడి బైక్‌ స్టంట్‌ను తమ కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు, స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సదరు యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.