పెండ్లి వేడుకలో వ్యక్తి హత్య... తమ్ముడిపై హత్యాయత్నం చేస్తుండగా.. 

పెండ్లి వేడుకలో వ్యక్తి హత్య... తమ్ముడిపై హత్యాయత్నం చేస్తుండగా.. 
  • రామగిరి మండలంలో ఘటన

రామగిరి, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో పెండ్లి వేడుక వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తమ్ముడిపై హత్యాయత్నం చేస్తుండగా అడ్డు వెళ్లిన అన్న కత్తి పోటుకు బలయ్యాడు. రామగిరి ఎస్సై తాడబోయిన శ్రీనివాస్ తెలిపిన ప్రకారం.. రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన మొలుగూరి కొమురయ్యగౌడ్​(58), సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లెకు చెందిన మొలుగూరి సత్తయ్య అన్నదమ్ములు. వీరి బంధువైన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి బుర్ర రాజకొమురయ్యకు వారితో కుటుంబ కలహాలు ఉన్నాయి. 

2011లో రాజకొమురయ్య కొడుకు తిరుపతి గుండారం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆ ఘటనకు కొమురయ్య, సత్తయ్యలే కారణమని రాజకొమురయ్య అనుమానం పెంచుకున్నాడు. శనివారం బేగంపేటకు చెందిన బుర్ర కుమార్ కూతురు వివాహం సెంటినరీ కాలనీ కమ్యూనిటీ హాల్‌‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి కొమురయ్య, సత్తయ్యలతో పాటు రాజకొమురయ్య కూడా హాజరయ్యారు. 

ఈ క్రమంలో రాజకొమురయ్య తనతో తెచ్చుకున్న కత్తితో ముందుగా సత్తయ్యపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అడ్డుకునేందుకు వచ్చిన కొమురయ్యను ఛాతిలో పొడవడంతో స్పాట్​లో మృతిచెందాడు. మృతుడు కొమురయ్య భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.