
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ తండ్రి తన కూతురిని కాపురానికి తీసుకెళ్లట్లేదని అల్లుడి తల్లిపై దాడిచేసి చంపాడు. సీఐ కిశోర్, స్థానికుల వివరాల ప్రకారం.. స్థానికంగా ఉండే వెన్న మహేశ్కూతురు గంగాభవానికి టౌన్‌లోని పురాణిపేటకు చెందిన కిరణ్ కు అయిదేండ్ల కింద పెండ్లయ్యింది. కొంత కాలంగా అత్త యమున(50).. కోడలు గంగాభవానితో గొడవపడుతూ ఉంది. భర్త కూడా తల్లికి సపోర్టుగా ఉంటుండడంతో భరించలేకపోయిన గంగాభవాని పుట్టింటికి వచ్చేసింది. ఎన్ని రోజులవుతున్నా భార్యను కాపురానికి తీసుకెళ్లేందుకు కిరణ్ రాకపోవడంతో సోమవారం మామ మహేశ్ అల్లుడి ఇంటికి వెళ్లాడు. ఆ టైంలో కిరణ్ఇంట్లో లేడు. ‘పంచాయితీ పెడదామని వచ్చిన ప్రతిసారీ కొడుకును బయటికి పంపిస్తున్నావ్..అసలు గొడవలన్నింటికీ కారణం నువ్వేనంటూ’ గంగాభవాని అత్త యమునపై మహేశ్దాడిచేసి కొట్టాడు. తీవ్రగాయాలపాలైన ఆమెను స్థానికులు హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా దారిలోనే చనిపోయింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు ఫైల్ చేసినట్లు సీఐ తెలిపారు