వ్యాక్సిన్ కోసం కలెక్టర్​ కు ముప్పుతిప్పలు

వ్యాక్సిన్ కోసం కలెక్టర్​ కు ముప్పుతిప్పలు

దహెగాం, వెలుగు: కరోనా సూది వేయించుకోనంటూ ఓ వ్యక్తి వ్యాక్సిన్​ సిబ్బంది, జిల్లా కలెక్టర్​ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా కలెక్టర్​ రాహుల్ రాజ్​100 శాతం వ్యాక్సినేషన్​ కోసం స్పెషల్ ​డ్రైవ్​చేపట్టారు. ఇందులో భాగంగా దహెగాం మండలంలోని అయినం గ్రామానికి మంగళవారం వ్యాక్సినేషన్​ సిబ్బందితో కలిసి వెళ్లారు. ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్​ వేశారు. గ్రామ  మాజీ ఎంపీటీసీ పెరుగు శంకరిబాయి భర్త శంకర్​ మాత్రం వ్యాక్సిన్​ వేసుకునేందుకు ఒప్పుకోలేదు.  కలెక్టర్ టీంకు దొరక్కుండా ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఆఫీసర్లు అడ్డుకున్నారు. దీంతో ఇంట్లోకెళ్లి గడియ పెట్టుకున్నాడు. ఎంత చెప్పినా తలుపులు తీయలేదు.

నాకు సూదంటే భయం, పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు సూదేసుకోలే. సచ్చినా మంచిదే.. కరోనా సూది మాత్రం వేసుకోనని భీష్మించాడు. వ్యాక్సిన్​ వేసుకోకుంటే కరోనా సోకే అవకాశముంటదని, ప్రాణంమీదకొస్తుందని కలెక్టర్​చెప్పినా వినిపించుకోలేదు. ఆ పక్క ఇంట్లో ఉంటున్న శంకర్ ​తల్లి కూడా వ్యాక్సిన్ ​వేయించుకునేందుకు ఒప్పుకోలేదు. దీంతో వారికి వ్యాక్సిన్​ వేయలేదు. ఇదే గ్రామంలో ఓ మందుబాబును వ్యాక్సిన్​ వేసుకొమ్మంటే నాలుగు ప్యాకెట్ల గుడుంబా తాగి సూదేసుకుంటానని చెప్పాడు. గ్రామంలో పలువురు వద్దని అన్నప్పటికీ వారికి నచ్చజెప్పి వ్యాక్సిన్​వేశారు. కలెక్టర్​ వెంట తహసీల్దార్​ రామ్మోహన్​రావ్, ఎంపీడీవో సత్యనారాయణ, మెడికల్​ఆఫీసర్​చంద్రకిరణ్, ఏపీవో చంద్రయ్య, సర్పంచ్​ జయేందర్, మెడికల్​స్టాఫ్​ ఉన్నారు.