కిషన్ రెడ్డిని బెదిరించిన వ్యక్తి అరెస్ట్

కిషన్ రెడ్డిని బెదిరించిన వ్యక్తి అరెస్ట్
  • చంపుతామని కువైట్​ నుంచి ఫోన్​ కాల్స్
  • నిందితుడు కడప జిల్లా కు చెందిన ఇస్మాయిల్
  • సొంతూరుకు రాగానే అరెస్టు చేసిన పోలీసులు

కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడు  వై.ఎస్.ఆర్ కడప జిల్లాకు చెందిన షేక్ ఇస్మాయిల్(43)గా గుర్తించారు. సీసీఎస్ అదనపు డీసీపీ రఘువీర్ చెప్పిన  ప్రకారం.. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన షేక్ ఇస్మాయిల్ 2017లో కువైట్ వెళ్ళాడు. అక్కడే క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సోషల్ మీడియాలో న్యూస్, రాజకీయ నాయకుల ప్రసంగాలు, గాసిప్స్ చూసేవాడు. ఈ క్రమంలో కిషన్ రెడ్డి ఫోన్ నంబర్ ఇంటర్ నెట్లో సెర్చ్ చేసి తెలుసుకున్నాడు. మే 20న కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ చేశాడు. +69734063 నంబర్ నుంచి ఆ రోజు సాయంత్రం 4.26 గంటలకు, మళ్ళీ 4.39 గంటలకు కాల్స్ చేసి బెదిరించాడు. దీంతో తనను చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని జూన్ 12న సైబర్ క్రైమ్ పోలీసులకు కిషన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు 66 డి ఐటీ యాక్ట్, 506, 507 ఐపీసి సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా కా ల్ కువైట్  నుంచి వచ్చినట్లు గుర్తించారు. కాల్స్ చేసింది షేక్ ఇస్మాయిల్ అని తెలుసుకున్నారు. నిఘా పెట్టారు. ఈ నెల మొదటి వారంలో ఇస్మాయిల్ కడప వచ్చాడని తెలుసుకున్నారు. మంగళవారం అరెస్ట్ చేశారు. ఇస్మాయిల్ నుంచి రెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.