హైదరాబాద్ లో దారుణం.. సరిగ్గా చదవడం లేదంటూ కొడుక్కి నిప్పంటించిన తండ్రి

హైదరాబాద్ లో దారుణం.. సరిగ్గా చదవడం లేదంటూ కొడుక్కి నిప్పంటించిన తండ్రి
హైదరాబాద్: కేపీహెచ్​బీ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. చదవడం లేదనే కారణంతో కొడుకుపై టార్పెంటాయిల్ పోసి నిప్పంటించాడో తండ్రి. కేపీహెచ్​బీ కాలనీలోని రోడ్ నంబర్ 2లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. నాగర్​కర్నూలు జిల్లాకు చెందిన బాలు కుటుంబం… కేపీహెచ్‌బీలోని మండల ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో గుడిసె వేసుకొని నివసిస్తున్నారు. అత‌ని భార్య సోనీ పాఠశాలలో అటెండర్ పనిచేస్తుండగా, వారి చిన్న కుమారుడు 12 ఏళ్ల చరణ్ అదే పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా ఇంటి వద్దే ఉంటున్న చరణ్ ఆన్​లైన్ తరగతులకు హాజరవుతున్నాడు. ఆదివారం నాడు రాత్రి టీవి చూస్తున్న చరణ్​ను తండ్రి బాలు బీడీలు తీసుకుని రమ్మని పంపించాడు. ఆ తర్వాత తిరిగి వచ్చిన చరణ్‌ని సరిగ్గా చదవటం లేదని, తరగతులకు హాజరవ్వటం లేదని చితకబాదాడు. అదే సమయంలో బాలుడిని కొట్టవద్దంటూ తల్లి సోనీ అడ్డుపడింది. కోపద్రిక్తుడైన బాలు… పెయింటింగ్​కు ఉపయోగించే టర్పెంటాయిల్‌ని కుమారుడిపై పోసి నిప్పంటించాడు. మంటలకు తాళలేక చరణ్ పరిగెత్తుతూ, స్కూల్ వెనకాల గోతిలో పడి పోయాడు. స్థానికులు గమనించి మంటలను ఆర్పివేసి… ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చరణ్ 60 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.