అడవిపంది అనుకొని స్నేహితుణ్ని కాల్చేశాడు

అడవిపంది అనుకొని స్నేహితుణ్ని కాల్చేశాడు

తిరువొత్తియూరు: అడవి జంతువుల వేటకు వెళ్లి పొరపాటున త‌న వెంట వ‌చ్చిన స్నేహితుడినే ఓ వ్యక్తి తుపాకీతో కాల్చిన ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని అంజెట్టి సమీపంలోని తొట్టి మంజువల్లిపురం మంజు గ్రామానికి చెందిన పసుప్ప(40), నాగరాజు (27)స్నేహితులు. ఒకే గ్రామానికి చెందిన వీరిద్దరూ అడవిపంది వేటకు వెళ్లాలని అనుకున్నారు. నాటు తుపాకులు తీసుకుని ఇద్దరూ గురువారం రాత్రి అటవీ ప్రాంతానికి వేటకు వెళ్లారు. అక్కడ అడవిపందులను వేటాడేందుకు చెరో దిక్కుకు వెళ్లారు.

అర్థరాత్రి పూట త‌న‌కు కాస్త దూరంలో ఏదో శబ్దం వినిపించడంతో అది అడవిపందే అనుకుని నాగరాజు తుపాకీ పేల్చాడు. ఆ తరువాత తుపాకీ పేల్చిన వైపు వెళ్లి చూడగా తూటా తగిలి పసుప్ప మృతి చెంది కనిపించాడు. తాను అడవిపంది అనుకుని కాల్చింది పసుప్పనని అర్థమైన నాగరాజు భయంతో అక్కడినుంచి పారిపోయాడు. శుక్రవారం ఉదయం అటవీ ప్రాంతానికి వెళ్లిన కొంతమందికి పసుప్ప మృతదేహం కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాత్రి వేటకు వచ్చారని తెలిసి నాగరాజు కోసం గాలిస్తున్నారు.