యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

హైదరాబాద్‌, వెలుగు: ప్రేమను తిరస్కరించిందన్న కారణంతో యువతి కండ్లల్లో కారం చల్లి కత్తితో దాడి చేసిన ఘటన ఎస్ఆర్​నగర్​లో సోమవారం జరిగింది. ఈ దాడిలో యువతి మెడ, చేతికి గాయాలయ్యాయి. స్థానికులు యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. మహబూబ్​నగర్​ జిల్లాకు చెందిన 28ఏండ్ల యువతి పదేండ్లుగా బోరబండ పరిధిలోని బంజారానగర్​లో ఉంటున్నది. ఓ ప్రైవేట్ షాపింగ్ మాల్​లో హౌస్​కీపింగ్​గా పని చేస్తున్నది. బోరబండలోని మోతీనగర్​కు చెందిన కిశోర్ షాపింగ్​ మాల్​లోనే సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. వీరిద్దరికీ ఆరేండ్లుగా పరిచయం ఉంది. తనను ప్రేమించాలని కిశోర్ ఆమె వెంటపడేవాడు. చాలాసార్లు అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్​తో కూడా గొడవ పడ్డాడు. కొన్ని రోజుల కింద అమ్మాయికి మరో వ్యక్తితో ఎంగేజ్​మెంట్ అయ్యింది.

ఇది తెలుసుకున్న కిశోర్, ఆమెపై కక్ష పెంచుకున్నాడు. యువతిపై దాడి చేసేందుకు ప్లాన్ చేశాడు. సోమవారం సాయంత్రం బాధిత యువతి ఇంటికెళ్తుండగా బంజారానగర్​లో అడ్డుకున్నాడు. కండ్లలో కారం చల్లి కత్తితో దాడి చేశాడు. గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె మెడ, ఎడమ చేతికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు కిశోర్ ని పట్టుకుని చితకబాదారు. అమ్మాయిని హాస్పిటల్​కు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, యువతికి ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. బాధితురాలి స్టేట్​మెంట్​ రికార్డు చేసిన పోలీసులు.. కిశోర్​పై కేసు రిజిస్టర్ చేశారు. ప్రేమను నిరాకరించినందుకే దాడి చేసినట్లు కిశోర్ ఒప్పుకున్నాడని, మంగళవారం కోర్టులో ప్రొడ్యూస్​ చేస్తామని పోలీసులు వివరించారు.