
- సామాజిక న్యాయాన్ని కేసీఆర్ విస్మరించారు: మంద కృష్ణ
- రెడ్డి వెలమలకే 10 మంత్రి పదవులా?
- జనాభాలో సగమున్న బీసీలకు 4 మంత్రి పదవులేనా?
- జనాభా దామాషా ప్రకారం ఎందుకివ్వరని ప్రశ్న
- రేపు వరంగల్‌లో ‘సామూహిక మహాదీక్ష’ నిర్వహిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని, సామాజిక స్ఫూర్తిని కేసీఆర్ విస్మరించారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్న మాదిగలకు జనాభా దామాషా ప్రకారం మంత్రి పదవులు ఎందుకివ్వరని ప్రశ్నించారు. మాదిగ, మాదిగ ఉపకులాలకు చెందిన12 మంది సభ్యులుంటే కేవలం ఒక్కరికే మంత్రి పదవి ఇచ్చారన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న కడియం శ్రీహరికి, 99 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచిన ఆరూరి రమేశ్‌కు, ధూంధాం ద్వారా లక్షలాది మందిని ఉద్యమం వైపు మళ్లించిన రసమయి బాలకిషన్‌కు ఎందుకివ్వలేదన్నారు.
తాటికొండ రాజయ్య, గువ్వల బాలరాజు, కాలె యాదయ్య, చిరుమర్తి లింగయ్య, మెతుకు ఆనంద్, మాణిక్యరావు, సండ్ర వెంకటవీరయ్య, అబ్రహం లాంటి వారు మంత్రి పదవులకు పనికిరారా అని నిలదీశారు. వీరిలో నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలూ ఉన్నారన్నారు. బీసీలు, బ్రాహ్మణ, వైశ్య కులాలకూ అన్యాయం జరిగిందన్నారు. కేబినెట్‌లో 18 మందిలో 10 మంది రెడ్డి, వెలమ సామాజిక వర్గానికి చెందిన వారేనన్నారు. 0.5శాతం ఉన్న వెలమలకు 4 పదవులు, 50 శాతమున్న బీసీలకూ 4 మంత్రి పదవులేనా అని ప్రశ్నించారు. 12 శాతమున్న ముస్లింలకు, గిరిజనులకు ఒక్కో మంత్రి పదవి ఎలా ఇస్తారన్నారు. ముస్లిం వర్గాల్లో వ్యతిరేకత పెరిగిందని, అందుకే బోధన్ఎమ్మెల్యే షకీల్ వెళ్లి బీజేపీ ఎంపీని కలిశారన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట మార్చారని, కొన్నాళ్లు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి ఇప్పుడు అదికూడా లేకుండా చేశారన్నారు.
22న సామూహిక మహాదీక్ష
మాదిగ, మాదిగ ఉపకులాలకు మంత్రివర్గ విస్తరణలో జరిగిన అన్యాయానికి నిరసనగా ఈనెల 22న వరంగల్‌లోని కేడీసీ గ్రౌండ్లో వేలాది మందితో ‘సామూహిక మహాదీక్ష‘ నిర్వహించనున్నట్లు మంద కృష్ణ తెలిపారు. మంత్రి వర్గ విస్తరణపై మాదిగ, మాదిగ ఉపకులాల్లో ఉన్న ఆవేదనను ఆ కార్యక్రమం ద్వారా తెలియజేస్తామన్నారు. ప్రస్తుత కేబినెట్‌ను రద్దు చేసి మళ్లీ విస్తరించాలన్నారు. మహాదీక్ష అనంతరం ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి హైదరాబాద్‌లో మరో మహాదీక్ష నిర్వహిస్తామన్నారు.