మానేరు రివర్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌కు మరో 8 ఎకరాలు.. కరీంనగర్ సిటీ వైపు భూసేకరణకు సర్కార్ నోటిఫికేషన్

మానేరు రివర్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌కు మరో 8 ఎకరాలు.. కరీంనగర్ సిటీ వైపు భూసేకరణకు సర్కార్ నోటిఫికేషన్
  •     ఫస్ట్ ఫేజ్ పనులు 82 శాతం పూర్తి, సెకండ్ ఫేజ్ పనులు స్పీడప్

కరీంనగర్‌‌‌‌, వెలుగు :  కరీంనగర్‌‌‌‌లోని మానేరు రివర్ ఫ్రంట్ కోసం మరో 8.05 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్న రివర్ ఫ్రంట్ కోసం నదికి ఎడమ వైపున (కరీంనగర్ సిటీ వైపు) ఈ  భూమిని సేకరించేందుకు చర్యలు తీసుకుంటోంది. 2022 మార్చిలో తొలుత రూ.410 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభం కాగా.. ఆ తర్వాత నిర్మాణ వ్యయాన్ని రూ.546 కోట్లకు పెంచారు. 

ఇందులో టూరిజం డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో రూ.100 కోట్ల విలువైన పనులు, ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో రెండు దశల్లో రూ.446 కోట్ల పనులు చేపట్టాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు అదనంగా మరో రూ.196 కోట్లతో కేబుల్ బ్రిడ్జిని నిర్మించారు. ఇప్పటికే  నదికి రెండు వైపులా కాంక్రీట్ ప్రొటెక్షన్ వాల్స్ కట్టారు. గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) స్టేతో ఏడాదిన్నరపాటు పనులు ఆగాయి. ఆ  తర్వాత స్టే ఎత్తేయడంతో పనులు ప్రారంభమైనప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి.

మంత్రుల ఆదేశాలతో స్పీడప్

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి ఫస్ట్ ఫేజ్ పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఎన్జీటీ స్టే ఎత్తేశాక ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తి చేయడంతో పాటు సెకండ్ ఫేజ్ పనులను స్పీడప్ చేసేందుకు జిల్లా ఇన్‌‌‌‌ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌‌‌‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌ ఇటీవల కలెక్టర్ తో మీటింగ్ నిర్వహించారు. 

ఈ ప్రాజెక్ట్ లో భాగంగా నదికి ఇరువైపులా ప్రొటెక్షన్ వాల్స్, నదిలో, నదీ తీరాన బోటింగ్, అమ్యూజ్ మెంట్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, ఫౌంటెయిన్లు, ఆడిటోరియం, మ్యూజియం, కిడ్స్ ప్లే ఏరియాలు, సీనియర్ సిటిజన్ గార్డెన్స్, ఫ్లవర్ గార్డెన్లు, రాక్ గార్డెన్లు, లేజర్ షోలు, విశాలమైన లాండ్ స్కేపింగ్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. 

8 ఎకరాలకు రూ.40 కోట్లు

రివర్ ఫ్రంట్ లో భాగంగా ఎల్ఎండీ స్పిల్ వే గేట్ల నుంచి అలుగునూరు బ్రిడ్జి అవతలి వరకు నదికి ఎడమ వైపున 8.05 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములు కోల్పోయే వారికి ఇచ్చేందుకు రూ.40 కోట్లు సైతం కేటాయించినట్లు తెలిసింది. అంతేగాక బోటింగ్, ఇతర వాటర్ స్పోర్ట్స్ కోసం ఎల్ఎండీ గేట్ల నుంచి కేబుల్ బ్రిడ్జి అవతలి వరకు ఎప్పుడూ 12 నుంచి 13 అడుగుల లోతు వరకు నీళ్లు నిల్వ ఉండేలా చెక్ డ్యామ్ ను నిర్మించారు. ఈ చెక్ డ్యామ్ కు 14 గేట్లు బిగించబోతున్నారు.