మానేరులో ఇసుక తవ్వకాలు ఆగట్లే..

మానేరులో ఇసుక తవ్వకాలు ఆగట్లే..
  • వీణవంక మండలంలో యథేచ్ఛగా ఇసుక రవాణా 
  • రోజూ వందలాది లారీలతో తరలిస్తున్న కాంట్రాక్టర్లు
  • ఎన్జీటీ, సుప్రీం ఆదేశాలు బేఖాతర్ 
  • పట్టించుకోని మైనింగ్, పోలీస్ యంత్రాంగం
  • కోర్టు ఆదేశాల కాపీ తమకు అందలేదని తప్పించుకుంటున్న అధికారులు
  • చల్లూరులో ఇసుక లారీలను అడ్డుకున్న స్థానికులు

కరీంనగర్, వెలుగు: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) చెప్పినా, సుప్రీంకోర్టు ఆదేశించినా మానేరు నదిలో ఇసుక తవ్వకాలు ఆగడం లేదు. కమర్షియల్ అవసరాలకు ఇసుక తవ్వకాలు చేపట్టొద్దన్న కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతూ కాంట్రాక్టర్లు నిత్యం వందలాది లారీలతో ఇసుకను తరలిస్తున్నారు.  ఎన్జీటీ ఆదేశాలతో పెద్దపల్లి జిల్లాలో, కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలం తనుగుల క్వారీలు మూతపడినప్పటికీ వీణవంక మండలంలోని ఏడు క్వారీల నుంచి జోరుగా ఇసుక తరలిస్తున్నారు. మైనింగ్, పోలీస్ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో క్వారీ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల వీణవంక మండలం చల్లూరు క్వారీ వద్ద స్థానికులు లారీలను అడ్డుకుని నిరసన తెలిపారు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతులు ఆందోళన చేశారు. 

ఎన్జీటీ ఏం చెప్పిందంటే.. 

మానేరు నదిలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని డిసెంబర్‌‌‌‌లోనే ఎన్డీటీ ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను కేవలం మానేరుకు అటువైపు ఉన్న పెద్దపల్లి జిల్లాకే పరిమితం చేసి.. ఇటువైపున్న కరీంనగర్ జిల్లాలో టీఎస్ఎండీసీ యథావిధిగా ఇసుక తోడుతోంది.  దీంతో కరీంనగర్ కు చెందిన రఘువీర్‌‌‌‌రెడ్డి ఎన్జీటీని ఆశ్రయించారు. ఈక్రమంలో పర్యావరణ అనుమతులు లేకుండా మానేరులో చేపట్టిన ఇసుక తవ్వకాలను నిలిపివేయాలంటూ ఏప్రిల్ 28న ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాణిజ్య అవసరాలకు తవ్వకాలు జరుపుతున్నందున ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్స్ తప్పనిసరని తాజాగా ఎన్టీటీ  చెన్నై బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఒకవేళ ఎన్విరాన్​మెంట్​ క్లియరెన్స్​ పొంది ఉంటే కాంట్రాక్ట్  ఏజెన్సీ తవ్వకాలు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.

తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు జిల్లాలోని వావిలాల, ఊటూరు, చల్లూరు, మల్లారెడ్డిపల్లి, కొండపాక, కోరేకల్, పోతిరెడ్డిపల్లి, తనుగుల క్వారీల్లో తవ్వకాలపై స్టే కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో కాంట్రాక్టర్లు మేలో వారంపాటు ఇసుక రవాణాను నిలిపివేశారు. ఆ తర్వాత తనుగుల మినహా మిగతా క్వారీల్లో యథావిధిగా తవ్వకాలు స్టార్ట్ చేశారు. ఈక్రమంలో ప్రజా అవసరాల కోసం ఇసుక తవ్వకాలకు అనుమతించాలని కాంట్రాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జులై ఫస్ట్​ వీక్​వరకు ఇసుక తవ్వకాలకు హైకోర్టు అనుమతించింది. ఈ ఉత్తర్వులను  సవాల్ చేస్తూ మానేరు పరిరక్షణ సమితి ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఎన్జీటీ మధ్యంతర ఆదేశాలను సమర్థిస్తూ హైకోర్టు ఉత్తర్వులపై 13న స్టే విధించింది. అయితే తమకు సుప్రీంకోర్టు ఆదేశాల కాపీ అందలేదనే సాకుతో ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. పైకి స్టాక్ యార్డులోని ఇసుకనే రవాణా చేస్తున్నట్లు చెప్తున్నప్పటికీ.. మానేరులో తవ్వి స్టాక్ యార్డులో పోయడం మాత్రం ఆపకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. అలాగే కమర్షియల్ అవసరాల కోసం  ఇసుక తరలిస్తున్నారని, ఇదంతా మైనింగ్, పోలీస్ యంత్రాంగానికి తెలిసే జరుగుతోందని ఆరోపిస్తున్నారు.  

చల్లూరు క్వారీలో ఆందోళన 

ఇసుక రవాణాను నిలిపివేయాలంటూ వీణవంక మండలం చల్లూరు క్వారీలో గ్రామస్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు. కమర్షియల్ అవసరాలకు ఇసుక తరలించొద్దని  సుప్రీం ఆదేశాలు ఉన్నా ఎలా తరలిస్తారంటూ నిర్వాహకులను ప్రశ్నించారు. లారీల రాకపోకలతో రోడ్లు ధ్వంసమవుతున్నాయని, ఇండ్లు దుమ్ముకొట్టుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాలతో బోర్లు, బావులు ఎండిపోయే పరిస్థితి నెలకొందని వాపోయారు. 

ప్రశ్నిస్తే అక్రమ కేసులు 
ఇసుక రవాణాపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు గురి చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా మానేరులో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ఎన్టీటీ ఇచ్చిన మధ్యంతర, వాటిని సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కలెక్టర్ అమలు చేయాలి. నదిలో ఇసుక తవ్వకాలు, రవాణాను నిలిపి వేయాలి. అక్రమాలను ప్రశ్నిస్తే ఇసుక మాఫియా నాపై కేసులు పెట్టి వేధిస్తోంది. ‌‌‌‌
 - సంది సురేందర్ రెడ్డి, మానేరు పరిరక్షణ సమితి