మణిపూర్లో పోలీసులు, సెంట్రల్ ఫోర్స్ ఆపరేషన్..అక్రమ బంకర్లు ధ్వంసం

మణిపూర్లో పోలీసులు, సెంట్రల్ ఫోర్స్ ఆపరేషన్..అక్రమ బంకర్లు ధ్వంసం

ఇంఫాల్: మణిపూర్ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. హింస చెలరేగిన జిల్లాల్లో పరిస్థితి అదుపులోనే ఉన్నా.. ఎప్పుడు  ఏం జరుగుతుందోననే  భయం ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్నది. అల్లర్లతో ప్రభావితమైన జిల్లా ల్లో కేంద్ర బలగాలతో కలిసి మణిపూర్ పోలీసులు శుక్రవారం సెర్చ్ ఆపరేషన్స్ చేపట్టారు. ఇల్లీగల్​గా ఏర్పాటు చేసుకున్న ఏడు బంకర్లను కూల్చేశారు.కౌత్రుక్ కొండ ప్రాంతాల్లో వీటిని నిర్మించారని పోలీసులు తెలిపారు. 


గురువారం చెలరేగిన అల్లర్ల కారణంగా ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్ జిల్లాల్లో రోజంతా కర్ఫ్యూ కొనసాగించిన అధికారులు.. శుక్రవారం ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా రిలీఫ్ ఇచ్చారు. ప్రజలు నిత్యావసర సరుకులు, మెడిసిన్స్ కొనుక్కునేందుకు అవకాశం కల్పించారు. 12 తర్వాత యథావిధిగా కర్ఫ్యూ కొనసాగించారు. బిష్ణుపూర్​లోని టెరాఖోంగ్సాంగ్బి వద్ద గురువారం అర్ధరాత్రి ఓ దుండగుడు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 35 ఏండ్ల మహిళ గాయపడింది.  ఆమెను పోలీసులు ఇంఫాల్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. 

బిష్ణుపూర్ జిల్లా నరనసీనలోని సెకండ్ ఇండియా రిజర్వ్ బెటాలియన్(ఐఆర్​బీ) హెడ్ క్వార్టర్ నుంచి కొందరు దుండగులు ఆయుధాలు ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. వేర్వేరు 19 వేల రౌండ్ల బుల్లెట్లు, ఏకే సిరీస్  రైఫిల్, 195 సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, ఐదు ఎంపీ 5 గన్స్, 16 నైన్ ఎంఎం పిస్టల్స్, 124 హ్యాండ్ గ్రనేడ్లుతో పాటు మరికొన్ని ఆయుధాలు ఎత్తుకెళ్లారన్నారు.