హైదరాబాద్ లోని ఆ 50 ఎకరాల్లో.. ఉర్దూ వర్సిటీ విస్తరణ!..మాస్టర్ ప్లాన్ రెడీ..

హైదరాబాద్ లోని  ఆ 50 ఎకరాల్లో.. ఉర్దూ వర్సిటీ విస్తరణ!..మాస్టర్ ప్లాన్ రెడీ..
  •     రంగారెడ్డి కలెక్టర్​ షోకాజ్ నోటీసుపై స్పందించిన ‘మనూ’ రిజిస్ట్రార్
  •     సమగ్ర నివేదికకు రెండు నెలల గడువు కోరుతూ లేఖ

హైదరాబాద్, వెలుగు: గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) భవిష్యత్ అవసరాలు, క్యాంపస్ విస్తరణపై దృష్టి సారించింది. వర్సిటీకి కేటాయించిన భూముల్లో.. మణికొండ జాగీర్ పరిధిలోని 50 ఎకరాల భూమిని వెనక్కి ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై వర్సిటీ సానుకూలంగా స్పందించింది. 

ఆ భూమిలో చేపట్టబోయే అభివృద్ధి పనుల వివరాలను వెల్లడిస్తూ, పూర్తి స్థాయి నివేదిక సమర్పించేందుకు సమయం కావాలని కోరింది. సీపీడబ్ల్యూడీ నుంచి డీపీఆర్ రావాల్సి ఉన్నందున, షోకాజ్ నోటీసుకు పూర్తి స్థాయి వివరణ ఇచ్చేందుకు తమకు రెండు నెలల సమయం కావాలని జిల్లా కలెక్టర్‌‌‌‌ను రిజిస్ట్రార్ అభ్యర్థించారు. వర్సిటీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ విజ్ఞప్తిని పరిశీలించాలని కోరారు.

నిర్మాణ పనులు ‘యాక్టివ్’గానే..

రంగారెడ్డి కలెక్టర్ నోటీసుకు సమాధానంగా మనూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్ కె ఇంతియాజ్ అహ్మద్ ఈ నెల 1న లేఖ రాశారు. ఆ 50 ఎకరాల భూమి ఖాళీగా లేదని.. భవిష్యత్ విస్తరణ కోసం రిజర్వ్ చేసినట్టు అందులో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయానికి అవసరమైన నూతన అకడమిక్ భవనాలు, విద్యార్థులకు హాస్టళ్లు, సిబ్బందికి నివాస సముదాయాల నిర్మాణ ప్రక్రియ ఇప్పటికే చురుగ్గా సాగుతోందని తెలిపారు. 

ఈ భూమిలో చేపట్టబోయే ప్రాజెక్టులకు సంబంధించి సీపీడబ్ల్యూడీ హైదరాబాద్ విభాగం ‘సమగ్ర ప్రాజెక్టు నివేదిక’ (డీపీఆర్​)ను సిద్ధం చేస్తోందని వివరించారు. ఆ నివేదిక రాగానే నిధుల మంజూరు కోసం కేంద్ర విద్యాశాఖ, హెఫాకు ప్రతిపాదనలు పంపుతామని లేఖలో పేర్కొన్నారు.

 అసలు విషయం ఇదీ..

1998లో ఉర్దూ వర్సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం గండిపేట మండలం మణికొండ జాగీర్ గ్రామంలోని సర్వే నంబర్ 211, 212లో 200 ఎకరాలను కేటాయించింది. అయితే, ఇందులో 50 ఎకరాలు ఇంకా ఖాళీగానే ఉందని, నిబంధనల ప్రకారం వినియోగంలో లేని ప్రభుత్వ భూమిని ఎందుకు వెనక్కి తీసుకోకూడదో తెలపాలని డిసెంబర్ 15, 2025న రెవెన్యూ శాఖ తరఫున రంగారెడ్డి కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన వర్సిటీ.. తాము ఆ భూమిని వృథాగా ఉంచలేదని, రాబోయే రోజుల్లో భారీ నిర్మాణాలు చేపట్టబోతున్నామని స్పష్టం చేసింది.