దళితబంధుపై బీఆర్​ఎస్​ బందిపోట్ల దాడి

దళితబంధుపై బీఆర్​ఎస్​ బందిపోట్ల దాడి

హైదరాబాద్, వెలుగు: ‘‘దళితబంధుపై బీఆర్​ఎస్​ బందిపోట్లు దాడి చేస్తున్నారు” అని పీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్​ మండిపడ్డారు. లబ్ధిదారుల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నారంటూ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే ఒప్పుకున్నారని, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతుంటే సీఎం కళ్లు మూసుకుని కాపాడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు.

అవినీతిపరులైన ఎమ్మెల్యేల జాబితాను సీఎం కేసీఆర్​ బయట పెట్టాలని డిమాండ్​ చేశారు. బీఆర్​ఎస్​ దోపిడీకి అంతే లేకుండా పోయిందన్నారు. మిషన్​ భగీరథ, మిషన్​ కాకతీయలో కేసీఆర్.. లిక్కర్​ కుంభకోణంలో కవిత, భూ కుంభకోణంలో కేటీఆర్​ దోచుకుంటే.. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కూడా అందినకాడికి లాగేస్తున్నారని మండిపడ్డారు. దళితబంధులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలపై గవర్నర్​, ఏసీబీ, సీబీఐకి ఫిర్యాదు చేస్తామన్నారు. అవినీతి ఎమ్మెల్యేలపై సీఎం  ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పీసీసీ జనరల్​ సెక్రటరీ చారకొండ వెంకటేశ్​ 
ప్రశ్నించారు.