గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాయిదా వేయండి..హైకోర్టులో అభ్యర్థుల పిటిషన్

గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాయిదా వేయండి..హైకోర్టులో అభ్యర్థుల పిటిషన్

హైదరాబాద్, వెలుగు : టీఎస్​పీఎస్సీ  గ్రూప్‌‌–1 ప్రిలిమ్స్‌‌ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.జూన్‌‌ 11న గ్రూప్‌‌–1 ప్రిలిమ్స్‌‌  నిర్వహిస్తామని టీఎస్​పీఎస్సీ ఇప్పటికే ప్రకటించిందని, ప్రిలిమ్స్‌‌ను కనీసం రెండు నెలల పాటు వాయిదా వేయాలని 36 మంది అభ్యర్థులు సంయుక్తంగా హైకోర్టులో పిటిషన్   వేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌మెట్‌‌ మండలం యామిజాల గ్రామానికి చెందిన బి. వెంకటేశ్, మెదక్, జగిత్యాల, మహబూబాబాద్‌‌ తదితర జిల్లాలకు చెందిన మొత్తం 36 మంది అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌‌ను గురువారం హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.

ఇందులో హోం శాఖ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ, టీఎస్​పీఎస్సీ చైర్మన్, టీఎస్​పీఎస్సీ సెక్రటరీ, హైదరాబాద్‌‌ సిటీ స్పెషల్‌‌ ఇన్వెస్టిగేషన్‌‌ టీం (క్రైం) అడిషినల్‌‌ కమిషనర్లను ప్రతివాదులుగా చేర్చారు. తెలంగాణ పబ్లిక్‌‌  సర్వీస్‌‌  కమిషన్‌‌  యాక్ట్‌‌  ప్రకారం గ్రూప్‌‌–1, 2, 3, 4 పరీక్షలు నిర్వహించాలంటే ప్రతి పరీక్షకు మధ్య కనీసం రెండు నెలల గ్యాప్‌‌ ఉండాలి. ‘‘నిరుద్యోగ అభ్యర్థులు ఆయా పరీక్షలకు ప్రిపేర్‌‌ కావడానికి వీలుగా గ్యాప్‌‌ ఉండాలన్న నిబంధనకు వ్యతిరేకంగా టీఎస్​పీఎస్సీగ్రూప్‌‌–1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు నోటిఫికేషన్‌‌ ఇవ్వడం చట్టవ్యతిరేకంగా ప్రకటించాలి.

ప్రిలిమ్స్ నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి. నిరుద్యోగులకు మేలు జరిగేలా ఆయా పరీక్షల్లో అర్హత సాధించేలా ఉండేందుకు ఈ పరీక్షను  వాయిదా వేయాలి” అని అభ్యర్థులు తమ పిటిషన్ లో కోరారు. ఈ మేరకు టీఎస్​పీఎస్సీ చైర్మన్, సెక్రటరీలకు స్వయంగా వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోయిందని వారు తెలిపారు. అభ్యర్థుల పిటిషన్‌‌ను గురువారం  జస్టిస్‌‌ కె.లక్ష్మణ్  విచారించనున్నారు. కాగా, పేపర్ల లీకేజీ వ్యవహారంపై సిట్‌‌ దర్యాప్తును రద్దుచేసి సీబీఐ దర్యాప్తునకు ఇవ్వాలని కోరుతూ దాఖలైన మరో వ్యాజ్యం జూన్‌‌ 5న హైకోర్టు ముందుకు విచారణకు రానుంది.