దళితబంధుపై డౌట్స్​

దళితబంధుపై డౌట్స్​

హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పైసల కోసం లబ్ధిదారులు టీఆర్ఎస్ లీడర్లను నిలదీస్తున్నారు. ఎన్నికల తర్వాత అకౌంట్లలో పైసలు ఉంటయో.. వాపస్ పోతయోనని అనుమాన పడుతున్నరు.  లోకల్ లీడర్లు, ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్తున్నా జనం నమ్మట్లేదని తెలిసింది. స్వయంగా కేసీఆరే అసెంబ్లీలో వివరణ ఇవ్వాల్సి వచ్చిందని సమాచారం. హుజూరాబాద్ బై ఎలక్షన్ కోసమే దళితబంధు తేలేదని, రాష్ట్రమంతా అమలు చేస్తామని, వచ్చే మార్చి బడ్జెట్‌‌‌‌లో రూ.20 వేల కోట్లను పథకం కోసం కేటాయిస్తామని కేసీఆర్ మంగళవారం ప్రకటన చేసినట్టు తెలిసింది. మరుసటి రోజు బుధవారం హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో స్కీమ్ పై అనుమానాలు, అపోహల నివృత్తికి హెల్ప్ డెస్క్‌‌‌‌లను కూడా ఏర్పాటు చేయడం లబ్ధిదారులకు నమ్మకం కలిగించేందుకేనని వాదనలు వినిపిస్తున్నాయి.


అంతే కాకుండా యూనిట్​ గ్రౌండింగ్‌‌కు రకరకాల కండీషన్లు పెట్టడం, గ్రౌండింగ్​ ప్రాసెస్​ లేటవుతుండటంతో ఇంకింత ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలయ్యాక పైసలు వస్తయా, వాపసు పోతయా అని భయపడుతున్నారు. ఎన్నికల ప్రచారానికి వస్తున్న నేతలను పథకం సంగతేంటని నిలదీస్తున్నారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. హుజూరాబాద్, జమ్మికుంట కేంద్రాల్లో దళితబంధు హెల్ప్​డెస్క్​లను ఏర్పాటు చేసింది. కౌన్సెలింగ్​ కోసం ఇద్దరు స్పెషలాఫీసర్లను కూడా నియమించింది.  
ఎలక్షన్​ స్టంట్​ అని ప్రచారం జరగడంతో..
ఆగస్టు 16న రాష్ట్ర ప్రభుత్వం దళితబంధును అధికారికంగా ప్రారంభించింది. అంతకుముందే సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో లబ్ధిదారులకు ఈ స్కీమ్ కింద రూ.10 లక్షల చొప్పున అధికారులు జమ చేశారు. ఆ తర్వాత స్కీమ్​ అమలుకు హుజూరాబాద్‌‌‌‌ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసి రూ.2 వేల కోట్లు కేటాయించింది. ఈ పథకం కేవలం ఎలక్షన్ స్టంట్ అని ప్రచారం జరగడంతో ప్రభుత్వ పెద్దలు ఆలోచనలో పడ్డారు. దీంతో వెంటనే ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, నాగర్‌‌‌‌ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలాలను పథకం అమలుకు ఎంపిక చేశారు. స్కీమ్‌‌కు, ఎన్నికలకు సంబంధం లేదనే నమ్మకం కలిగించేందుకే  దళిత ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న 4 నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారనే వార్తలు అప్పట్లో వినిపించాయి. 
హెల్ప్​ డెస్క్​లకు తొలి రోజు 37 మంది
హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ ఆఫీసుల్లో ఏర్పాటు చేసిన దళితబంధు హెల్ప్ డెస్క్‌‌లను ఎస్సీ కార్పొరేషన్ అధికారులు బుధవారం ప్రారంభించారు. హెల్ప్ డెస్క్‌లు స్టార్ట్ ​చేశారని తెలిశాక హుజూరాబాద్‌లో 22 మంది వరకు వచ్చి తమ అకౌంట్ల గురించి ఎంక్వైరీ చేసుకున్నారు. జమ్మికుంటలో 15 మంది తమ అకౌంట్ వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. హెల్ప్ డెస్క్‌లను పరిశీలించాక ఎస్సీ కార్పొరేషన్ జిల్లా ఈడీ సురేశ్​ మాట్లాడారు.హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అర్హులైన దళిత కుటుంబాలకు వాళ్ల అకౌంట్లలో దళితబంధు డబ్బులు జమ చేశామని, స్కీమ్ అమలుపై అనుమానాలు, అపోహలుంటే బ్యాంకుల్లో, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ ఆఫీసుల్లోని హెల్ప్ డెస్క్ లను సంప్రదించాలని సూచించారు. జమ్మికుంటలో రాజేందర్ (9032806250)ను, హుజూరాబాద్ లో సంపత్ రావు(9989334509)ను హెల్ప్ డెస్క్ ఇన్​చార్జులుగా నియమించినట్లు తెలిపారు. త్వరలో మిగతా మండల కేంద్రాల్లోనూ హెల్ప్ డెస్క్ లను ప్రారంభించనున్నట్లు తెలిసింది.