
హైదరాబాద్ : రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్, తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ మృతిపై పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు సంతాపం వ్యక్తం చేశారు.
‘‘తెలంగాణ రాష్ట్ర ఓ గొప్ప గాయకున్ని, భవిష్యత్ నాయకున్నీ కోల్పోయింది. తన ఆటపాటతో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర పునర్నిర్మాణంలో సాయిచందర్ విశేషమైన పాత్ర పోషించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి.’’
- గుత్తా సుఖేందర్‌రెడ్డి, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్
‘‘తమ్ముడు సాయిచంద్ అకాల మరణం ఎంతో బాధకు గురిచేసింది. ఆయన తన ఆట, పాటతో తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఉద్యమంలో సాయిచంద్ పోషించిన పాత్రను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదు. భౌతికంగా మన మధ్య లేకున్నా పాట రూపంలో అందరి గుండెల్లో ఆయన చిరకాలం నిలిచిపోతారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’’
-మంత్రి హరీశ్‌రావు
‘‘తెలంగాణ ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయింది. ఉద్యమం, రాష్ట్ర పునర్నిర్మాణంలో సాయిచంద్ పాత్ర కీలకం. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలి. సాయిచంద్ కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలి’’
- మంత్రి శ్రీనివాస్ గౌడ్
‘‘ తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర పునర్నిర్మాణంలో సాయిచంద్ సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’’
- మంత్రి జగదీశ్‌రెడ్డి
సాయి చంద్ మృతదేహానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి నివాళులర్పించారు. సాయిచంద్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
తెలంగాణ ఉద్యమంలోకి సుడిగాలిలా వచ్చి ఎన్నో పాటలు పాడాడు. BRS సభల్లో గంటలకొద్దీ పాటలు పాడాడు. సాయి చంద్ చనిపోవడం చాలా బాధగా ఉంది. గొప్ప గాయకుడిగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు.
దేశపతి శ్రీనివాస్
చిన్న వయసులోనే సాయి చంద్ మరణించడం చాలా బాధాకరం అన్నారు ప్రజా గాయకురాలు విమలక్క. మలిదశ ఉద్యమంలో సాయిచంద్ తో తాము వేదిక పంచుకున్నామన్నారు. గతంలో ఒకసారి సాయిచంద్ కు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. తెలంగాణ సమాజం గొప్ప గాయకున్ని కోల్పోయిందన్నారు. మంచి నాయకుడిగా ఎదుగుతున్న సమయంలో మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అరుణోదయలో సాయిచంద్ తమతో కలిసి పని చేశాడని గుర్తు చేసుకున్నారు విమలక్క
విమలక్క, ప్రజా గాయకురాలు