భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని అడవుల్లో ఉన్న మావోయిస్టుల బంకర్‌ను భద్రతాబలగాలు సోమవారం గుర్తించాయి. గంగులూరు -పిడియా పోలీస్‌స్టేషన్ల నుంచి బయలుదేరిన భద్రతా బలగాలు డోడే తూంనార్ -పటేల్ పారాల మధ్య అడవుల్లో కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో రెండు గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలోని గుట్టల్లో భూమి లోపల బంకర్ ఉన్నట్లు బాంబుస్క్వాడ్ టీంలు పసిగట్టాయి.
బంకర్‌ను తవ్వి చూడగా... పేలుడు పదార్థాలు, రెండు జనరేటర్లు, రెండు మెషీన్లు, వెల్డింగ్ మెషీన్, డ్రిల్ మెషీన్, ఇన్వర్టర్లు, బ్యాటరీలు, సోలార్ సెట్లు, మోటార్లు, దేశీ బీజీఎల్ లాంచర్లు, 29 బీజీఎల్ సెల్స్, 50 మీటర్ల కరెంటు వైరు కనిపించాయి. మావోయిస్టులు తమ ఆయుధాలకు రిపేర్లు చేయడం, మందుపాతరలను తయారు చేయడం వంటి కార్యక్రమాలను ఈ బంకర్‌లో నిర్వహించే వారని తేలింది. బంకర్‌లో దొరికిన వాటిని స్వాధీనం చేసుకొని బీజాపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు.
