మావోయిస్ట్ పార్టీకి మరో బిగ్ షాక్.. భార్యతో కలిసి అగ్రనేత పసునూరి నరహరి సరెండర్

మావోయిస్ట్ పార్టీకి మరో బిగ్ షాక్.. భార్యతో కలిసి అగ్రనేత పసునూరి నరహరి సరెండర్

హైదరాబాద్: పతనం అంచుల్లో ఉన్న మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, సెంట్రల్ కమిటీ మెంబర్ పసూనూరి నరహరి అలియాస్ సంతోష్ తన భార్యతో కలిసి తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఈ విషయాన్ని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ మంగళవారం (మే 26) ధృవీకరించారు. ఈ మేరకు డీజీపీ సీవీ ఆనంద్ నరహరి దంపతుల లొంగుబాటు వివరాలను మీడియాకు వెల్లడించారు.

 మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు (CCM) పసునూరి నరహరితో పాటు ఆయన భార్య మేదర దాసమ్మ అలియాస్ లక్ష్మి అలియాస్ జోజా సరెండర్ అయ్యారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి అయినా నరహరి 45 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ మావోయిస్ట్ పార్టీలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. 

మావోయిస్ట్ పార్టీ టెక్నికల్ డిపార్ట్మెంట్లో నరహరి సుధీర్ఘ కాలం పని చేశారని.. తుపాకులు, రాకెట్లు తయారీలో నిపుణుడిని తెలిపారు. అలాగే, మావోయిస్ట్ పార్టీ బీహార్- ఝార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ కార్యదర్శిగా పని చేశాడని వెల్లడించారు. ఆయుధాల సరఫరా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారన్నారు. 

నరహరిపై రూ.25 లక్షలు ఆయన భార్య దాసమ్మపై రూ.20 లక్షల రివార్డు ఉండగా ఆయా చెక్‎లను డీజీపీ వారికి అందజేశారు. 2024 నుంచి ఇప్పటివరకు 822 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. ఒక్క 2026లోనే ముగ్గురు CCMలు, 11 మంది SCMలతో కలిపి 264 మంది సరెండర్ అయ్యారని పేర్కొన్నారు. 

AK-47, INSAS, LMG సహా 334 అత్యాధునిక ఆయుధాల స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తెలంగాణకు చెందిన ముగ్గురు అగ్ర మావోయిస్టులు మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నట్లు వెల్లడించారు. మావోయిస్టు పార్టీ పతనం అంచుకు చేరిందని.. అజ్ఞాతంలో ఉన్న వారు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని డీజీపీ సూచించారు.