ఆయుధాలు వదిలేయడంపై మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఈ మేరకు మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ సీఎంలకు బహిరంగ లేఖ రాశారు మావోలు. మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ ఆపితే తాము ఆయుధాలు వదిలేస్తామని చెప్పారు. సీసీఎంలో నిర్ణయం తీసుకున్నామని జోనల్ కమిటీలకు కూడా సమాచారం ఇచ్చామన్నారు. డిసెంబర్ 15 లోపు ప్రభుత్వాలు స్పందించాలన్నారు. ప్రభుత్వాలు స్పందిస్తే కాల్పుల విరమణకు ఒప్పుకుంటామని తెలిపారు.
మావోయిస్టులందరూ లొంగిపోతారు ఎప్పటి నుంచి ఆపరేషన్ కూంబింగ్ ను నిలిపేస్తారో..అపుడే తాము ఆయుధాలు వీడుతామని స్పష్టం చేశారు మావోలు. ఈ సమష్టి నిర్ణయాన్ని అమలు చేసేందుకు తమకు ఫిబ్రవరి 15 వరకు టైమివ్వాలని కోరారు. ఈ విజ్ఞప్తి వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని చెప్పారు మావోలు.
మావోయిస్టులు ఆయుధాలను విడిచి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం పూర్తిగా అంతం చేస్తామన్నారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ కగార్ పేరుతో మావోలను ఏరివేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పలువు కీలక మావోయిస్టు నేతలు ఎన్ కౌంటర్లో చనిపోయారు. పలు రాష్ట్రాల్లో లొంగిపోయారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఆయుధాలు వీడటంపై ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.
