ప్రీతిని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలె: మావోయిస్టులు

ప్రీతిని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలె: మావోయిస్టులు

జయశంకర్ భూపాలపల్లి : ప్రీతి మృతికి కారకులైనవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జయశంకర్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి డివిజన్ మావోయిస్ట్ పార్టీ  కార్యదర్శి వెంకట్ సోషల్ మీడియాలో లేఖ విడుదల చేశారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని చెబుతున్న ప్రభుత్వాలు వారికి రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నారని మండిపడ్డారు. వరంగల్ లో వైద్య విద్యార్థిని ప్రీతిని సీనియర్ సైఫ్ ర్యాగింగ్ చేయడం వల్లే ఆత్మహత్య చేసుకున్నా యాజమాన్యం  ఆ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని వెంకట్ ఆరోపించారు. ప్రీతికి న్యాయం చేయాలని విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే ఆమె ఆత్మహత్యకు సైఫ్ కారణం కాదని హాస్పిటల్ యాజమాన్యం బుకాయిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆఫీసుల్లో మహిళలపై వేధింపులు, కాలేజీల్లో ర్యాగింగ్ నిత్యకృత్యమయ్యాయని ఫలితంగా మహిళలు ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో మహిళలంతా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.