
- బ్యాలెట్, బుల్లెట్ ఒకే ఒరలో ఉండలేవు: బండి సంజయ్
- నక్సలైట్ల ఏరివేత కొనసాగిస్తం.. నక్సల్స్ ముక్త్ భారత్ మా ధ్యేయం
- మావోయిస్టులతో చర్చలు జరపాలని రేవంత్, కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్య
కరీంనగర్, వెలుగు: బాక్సైట్ తవ్వకాల కోసమే చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులను చంపుతున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని, దేశంలో గనుల తవ్వకాలు 1947 నుంచి జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. నక్సలిజం తీవ్రంగా ఉన్న సమయంలో కూడా తెలంగాణ, చత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో గనుల తవ్వకాలు జరిగాయి కదా? అని గుర్తు చేశారు.
పేదరికం ఉన్నంత కాలం నక్సలిజం ఉంటుందని, ఆపరేషన్ కగార్‌ను ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. మావోయిస్టులతో గతంలో చర్చలు జరిపిన కాంగ్రెస్ ఏం సాధించిందని ప్రశ్నించారు. శనివారం కరీంనగర్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘నక్సల్స్నరమేధం–మేధోమథనం’ చర్చలో బండి సంజయ్ మాట్లాడారు. మావోయిస్టుల సమస్య సామాజిక కోణంగా చూడాలని పౌర హక్కులు, మానవ హక్కుల సంఘం నేతలు మాట్లాడడం సిగ్గు చేటని అన్నారు. మావోయిస్టుల చేతిలో వేలాదిమంది అమాయక ప్రజలు చనిపోయినప్పుడు సామాజిక కోణం గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు.
‘ఆపరేషన్కగార్’ను ఆపే ప్రస్తకే లేదు..
‘ఆపరేషన్ కగార్’ను ఆపే ప్రసక్తే లేదని, మావోయిస్టులను ఏరిపారేసే కార్యక్రమం కొనసాగుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించి ‘నక్సల్ ముక్త్ భారత్’ గా మార్చి తీరుతామని అన్నారు. రాజకీయాల్లోకి రాకుండా ఏబీవీపీలో ఫుల్ టైమర్‌గా ఉంటూ సేవలందించాలని గతంలో భావించానని, విద్యార్థి సమస్యలపై పోరాడుతున్న తనపై అనేక కేసులుండటంతోనే రాజకీయాల్లోకి వచ్చి పోరాటాలు చేయాల్సి వచ్చిందన్నారు.
యూపీఏ హయాంలో 200 జిల్లాలకు విస్తరించిన నక్సలిజం.. మోదీ హయాంలో 12 జిల్లాలకే పరిమితమైందని తెలిపారు. పేద ప్రజల కోసం పోరాడుతున్నామని తుపాకీ పట్టిన మావోయిస్టులు.. ఆ పేదలకే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందకుండా చేశారని విమర్శించారు. పంద్రాగస్టునాడు జాతీయ పతాకాన్ని కూడా ఎగరనీయనివారు ఎలా దేశ భక్తులవుతారని ప్రశ్నించారు. ‘‘మేం బ్యాలెట్‌తోనే సమాధానం చెప్పాలంటున్నం.. వాళ్లు మాత్రం బుల్లెట్‌తో జవాబిస్తమంటున్నారు.
ప్రజాస్వామ్యం అనే ఒరలో బ్యాలెట్, బుల్లెట్ అనే రెండు కత్తులు ఉండలేవు. తుపాకీ వీడితేనే చర్చలైనా, పరిష్కారాలైనా చూపేది. ప్రజాస్వామ్యంలో తుపాకీ ఒక్కరే పట్టాలి. అది పోలీసోడే కావాలి. ఆ పోలీసోడు పట్టిన తుపాకీ ప్రజలకు రక్షణ కవచం కావాలి. అంతే తప్పా ఎవరు పడితే వాళ్లు తుపాకీ పట్టి మనుషులను చంపుతామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఏరిపారేసి తీరుతాం. మోదీ, అమిత్ షా నాయకత్వంలో వచ్చే మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తాం” అని వ్యాఖ్యానించారు.