మహారాష్ట్ర ఎమ్మెల్యే ఇంటికి నిప్పు

మహారాష్ట్ర ఎమ్మెల్యే ఇంటికి నిప్పు
  • హింసాత్మకంగా మారిన మరాఠా కోటా నిరసనలు

ముంబై: మహారాష్ట్రలో మరాఠా కోటా నిరసనలు హింసాత్మకంగా మారాయి. బీడ్​ జిల్లాలో సోమవారం కోటా నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. ఎన్సీపీ (అజిత్​ పవార్ వర్గం) ఎమ్మెల్యే ప్రకాశ్​ సోలంకీ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఇంటిపై రాళ్లు విసిరి, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. మరాఠా కోటా కోసం నిరాహార దీక్ష చేస్తున్న మనోజ్ జారంజేకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే సోలంకీ వ్యాఖ్యలు చేశారని నిరసనకారులు ఈ దాడికి పాల్పడ్డట్లు సమాచారం. దాడి జరిగినపుడు తాను ఇంట్లోనే ఉన్నానని, అదృష్టవశాత్తూ తన కుటుంబ సభ్యులకు కానీ, పనివాళ్లకు కానీ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎమ్మెల్యే సోలంకీ చెప్పారు.

పెద్ద సంఖ్యలో జనం తన ఇంట్లోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశారని, ఇంటికి నిప్పు పెట్టారని తెలిపారు. అనంతరం నిరసనకారులు అక్కడి నుంచి మాజల్ గావ్ మున్సిపల్ ఆఫీసుకు వెళ్లి అక్కడా విధ్వంసం సృష్టించారని పోలీసులు తెలిపారు. మున్సిపల్ ఆఫీసు బిల్డింగ్ మొదటి అంతస్తులో నిప్పు పెట్టారని వివరించారు. బిల్డింగ్​లోకి చొరబడి తలుపులు, కిటికీలు, కుర్చీలను విరగకొట్టారని చెప్పారు.

ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో గంగాపూర్ లోనూ హింసాత్మక ఆందోళనలు జరిగాయి. బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ బాంబ్ ఇంటిలోకి చొరబడి విలువైన వస్తువులను నాశనం చేశారని తెలిపారు. అయితే ఈ రెండు ఘటనలలోనూ ఎవరికీ గాయాలు కాలేదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ హింసకు కారణమైన వారిని వదిలిపెట్టబోమని, పట్టుకుని చట్టం ముందు నిలబెడతామని తెలిపారు. ఈ ఘటనపై  ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాఫ్తులో భాగంగా సోలంకీ ఇంటి దగ్గర్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి పరిశీలిస్తున్నారు.