దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఉదయం ఆరంభంలో లాభాలతో మెుదలైనప్పటికీ ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే మధ్యాహ్నం ట్రేడింగ్ సమయంలో ఈ నష్టాలు భారీగా పెరిగి మార్కెట్ల 3 రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ప్రధానంగా మార్కెట్లు బేర్ పంజాలో పడటంతో 2.52 గంటల సమయంలో సెన్సెక్స్ 1074 పాయింట్ల నష్టంలో ఉండగా నిఫ్టీ సూచీ 302 పాయింట్లు లాస్ అయ్యింది. క్లోజింగ్ సెన్సెక్స్ ఏకంగా 1450 పాయింట్లకు పైగా నష్టాల్లోకి జారుకుని అందరినీ షాక్ కి గురిచేసింది. నిఫ్టీ బ్యాంక్ సూచీ 695 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 660 పాయింట్లకు పైగా నష్టాలతో కొనసాగుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వరుసగా మూడు రోజుల పాటు లాభాల్లో నడిచిన మార్కెట్లు, ఫిబ్రవరి 19న ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమై ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపారు. గురువారం భారత స్టాక్ మార్కెట్లలో ఈ భారీ నష్టాల ప్రకంపనలకు వెనుక కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అమెరికా-ఇరాన్ యుద్ధ భయాలు:
మార్కెట్లను భయపెడుతున్న ప్రధాన అంశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్య తీసుకునే అవకాశం ఉందన్న వార్తలే. ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $70 మార్కును దాటింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హార్ముజ్ జలసంధి వద్ద అంతరాయం కలగవచ్చన్న ఆందోళనలు గ్లోబల్ ఇన్ఫ్లేషన్ భయాలను పెంచుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రేడర్లు అస్సలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు.
బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు:
సెన్సెక్స్, నిఫ్టీ పతనానికి బ్యాంకింగ్ రంగం ప్రధాన కారణమైంది. యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 1% నుండి 1.8% వరకు నష్టపోయాయి. బ్యాంక్ నిఫ్టీ కీలకమైన 61వేల స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు కూడా వరుసగా 0.9%.. 0.51% మేర పతనం కావడం మార్కెట్ వీక్నెస్‌ను సూచిస్తోంది.
పెరిగిన వోలటాలిటీ:
మార్కెట్లో అస్థిరతను సూచించే ఇండియా విక్స్ ఏకంగా 8.1% పెరిగి 13.21 స్థాయికి చేరింది. దీనికి తోడు ఫిబ్రవరి 19న సెన్సెక్స్ F&O ఎక్స్‌పైరీ డే కావడంతో ఒడిదుడుకులు మరింత పెరిగాయి. ఇన్వెస్టర్లు కొత్త పొజిషన్లు తీసుకోవడం కంటే.. ఉన్న లాభాలను కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వటం కూడా మార్కెట్లను అస్థిరపరిచింది.
కీలక టెక్నికల్ లెవెల్స్:
మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. నిఫ్టీ మళ్లీ పుంజుకోవాలంటే 25,900 – 26,000 మార్కును స్థిరంగా దాటాల్సి ఉంటుంది. ఒకవేళ మార్కెట్ మరిన్ని నష్టాల్లోకి వెళ్తే 25,700 – 25,660 స్థాయిలు క్విక్ సపోర్ట్ గా పనిచేస్తాయి.
ప్రస్తుతానికి ఇది కేవలం తాత్కాలిక ప్రాఫిట్ బుకింగ్ మాత్రమేనని, ట్రెండ్ రివర్సల్ కాదని నిపుణులు భావిస్తున్నారు. అయితే.. యుద్ధ ఉద్రిక్తతలు తగ్గేవరకు మార్కెట్లు రేంజ్ బౌండ్‌లోనే ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
