భారత స్టాక్ మార్కెట్లు ఏప్రిల్ నెలను భారీ లాభాలతో స్టార్ట్ చేశాయి. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు తనకు యుద్ధాన్ని సాగతీసే ఆలోచన లేదని దానిని త్వరలోనే క్లోజ్ చేయాలనుకుంటున్నట్లు చేసిన ప్రకటనతో గ్లోబల్ మార్కెట్ల నుంచి భారత మార్కెట్ల వరకూ స్వాగతించాయి. దీంతో ఇవాళ మార్కెట్ల ప్రారంభం నుంచి భారీ బుల్ ర్యాలీ కొనసాగుతోంది. ఉదయం 9.50 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1942 పాయింట్ల లాభంతో ఉండగా నిఫ్టీ సూచీ 590 పాయింట్లకు పైగా లాభపడింది. ఇక బ్యాంక్ నిఫ్టీ సూచీ 1360 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1773 పాయింట్ల లాభంతో దూసుకుపోతున్నాయి.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సడలడంతో భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఇరాన్‌పై దాడులను రెండు మూడు వారాల్లో నిలిపివేసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లలో ఆశలు చిగురింపజేసింది. బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లను భారీ లాభాల దిశగా నడిపిస్తున్న వివిధ కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ముడిచమురు తగ్గుదల - మార్కెట్ల జోరు..
యుద్ధం ముగిసే సంకేతాలు కనిపిస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 105 డాలర్లకు పడిపోయింది. ఈ సానుకూల ప్రభావంతో ఆసియా మార్కెట్లు 3.7% వరకు పెరిగాయి. భారత మార్కెట్లోనూ అన్ని రంగాలు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ 50లోని అన్ని షేర్లు గ్రీన్ జోన్‌లో ఉన్నాయి. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు కూడా 3% పైగా వృద్ధిని నమోదు చేశాయి.
బ్యాంకింగ్ రంగంలో రికవరీ..
గత మార్చి సిరీస్‌లో దాదాపు 17% పతనమైన బ్యాంక్ నిఫ్టీ, ఇప్పుడు వేగంగా కోలుకుంటోంది. కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకులు సరైన కారణాలు లేకుండానే భారీగా పడిపోయాయని.. ఇది దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మంచి అవకాశమని నిపుణులు అంటున్నారు. అటు ఓలటాలిటీ ఇండెక్స్ కూడా 10% తగ్గడం మార్కెట్లో స్థిరత్వాన్ని సూచిస్తోంది.
టెక్నికల్ వ్యూ..
నిఫ్టీ 24,000 మార్కును అధిగమించి నిలకడగా కొనసాగితేనే మార్కెట్లో బుల్లిష్ ట్రెండ్ బలపడుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంతవరకు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటూ వ్యాల్యూ స్టాక్స్ కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
