దేశంలో ప్రస్తుతం డిజిటల్ గోల్డ్ తెగ ప్రజాధరణ పొందుతోంది. తక్కువ పెట్టుబడులతో రోజూ ఇన్వెస్ట్ చేసేందుకు వీలు ఉండటంతో చాలా మంది ప్రజలు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ తాజాగా హెచ్చరిక జారీ చేసింది. ఆన్‌లైన్‌లో కేవలం రూ.10తోనే బంగారం కొనుగోలు చేయగలమని ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న అనేక ప్లాట్‌ఫార్మ్‌లతో పెట్టుబడిదారులకు ప్రమాదకరమని సెబీ స్పష్టం చేసింది.
ప్రస్తుతం పలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లు “డిజిటల్ గోల్డ్”, “ఇ–గోల్డ్” పేరుతో పెట్టుబడులను తీసుకుంటున్నాయి. అయితే ఇవి సెక్యూరిటీస్ చట్టాల పరిధిలోకి రావని, వస్తు డెరివేటివ్స్‌గానూ గుర్తింపు పొందలేదని పేర్కొంది. ఈ ఉత్పత్తులపై ఎలాంటి నియంత్రణలు లేకపోవడం వల్ల పెట్టుబడిదారులు పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ఉత్పత్తులు పూర్తిగా సెబీ పర్యవేక్షణలో లేవని, కనుక వీటిలో పెట్టుబడి పెట్టే వారికి సెక్యూరిటీస్ మార్కెట్‌లో లభించే రక్షణ వ్యవస్థలు అందుబాటులో ఉండవన్నారు.
ప్రస్తుతం తనిష్క్, ఎంఎంఎంటీసీ పాంప్, అదిత్య బిర్లా క్యాపిటల్, ఫోన్‌పే, కారట్‌లేన్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి ప్రఖ్యాత సంస్థలు డిజిటల్ గోల్డ్ అందిస్తున్నాయి. టాటా గ్రూప్‌కు చెందిన తనిష్క్ వెబ్‌సైట్‌లో “కేవలం రూ.100తో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం కొనుగోలు చేయవచ్చని” చెబుతూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఎంఎంఎంటీసీ పాంప్ “ఎప్పుడు కావాలన్నా కొనండి, అమ్మండి, లేదా రిడీమ్ చేసుకోండి” అంటూ డిజిటల్ గోల్డ్ సౌకర్యాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే వీటిలాంటి ట్రస్టెడ్ బ్రాండ్లు కూడా విఫలమైతే పెట్టుబడిదారులకు చట్టపరమైన రక్షణ ఉండదని సెబీ హెచ్చరించింది.
ప్రస్తుతం బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు సురక్షితమైన, నియంత్రిత మార్గాలైన గోల్డ్ ఈటీఎఫ్‌లు , ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్, ఎక్స్చేంజ్‌లలో ట్రేడ్ అయ్యే గోల్డ్ డెరివేటివ్ కాంట్రాక్టుల ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చని. ఇవన్నీ సెబీ పరిరక్షణలో ఉండటంతో పెట్టుబడిదారుల నిధులు సురక్షితంగా ఉంటాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం నియంత్రణ లేని పెట్టుబడి మార్గాలను నిరుత్సాహపరుస్తూ, ఇన్వె్స్టర్లు సురక్షితమైన మార్గాలను ఎంచుకోవాలని సూచిస్తోంది.
