
తెలంగాణలో టీఆర్ఎస్కు బుద్ధి చెప్పడం బీజేపీతోనే సాధ్యమవుతుందని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఆయన ఇవాళ బీజేపీలో చేరారు.కేంద్ర మంత్రి శర్వానంద సోనోవాల్ ఆయనకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి అహ్వనించారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే ఆరుణ, వివేక్ వెంకటస్వామి ఇతర నేతలు హాజరయ్యారు. ఇటీవల కాంగ్రెస్ కు శశిధర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
టీఆర్ఎస్కు బుద్ధి చెప్పడం బీజేపీతోనే సాధ్యం : మర్రి శశిధర్ రెడ్డి
తెలంగాణ ప్రజలు మంచి సర్కారును కోరుకున్నరు.. కానీ అది రాలేదని శశిధర్ రెడ్డి అన్నారు. మొత్తం ప్రపంచంలో ఇంత అవినీతి ప్రభుత్వం ఎక్కడా లేదని ఆరోపించారు. గత ఎనిమిదిన్నర ఏళ్లుగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఫెయిల్ అయిందన్నారు. మోడీ నాయకత్వంలో దేశం ముందుకు వెళుతోందని ... తాను ఎంతో ఆలోచించాకే బీజేపీలో చేరానన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు బుద్ధి చెప్పడం బీజేపీతోనే సాధ్యమవుతుందని, ఇలాంటి ఘట్టంలో భాగస్వామ్యం అవుతున్నందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానన్న శశిధర్ .. రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పాటుకు ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమేనన్నారు.
అటు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన అనంతరం ఆ పార్టీ పై శశిధర్ రెడ్డి కీలకమైన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, అది నయం చేయలేని స్థితికి చేరుకుందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్ కు లేదన్నారు . రేవంత్ వ్యవహార శైలి సరిగ్గా లేదని ఆయన తీరు వల్లే ఈరోజు చాలా మంది కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారని ఆరోపించారు. రేవంత్ వైఖరి వల్ల తెలంగాణలో కాంగ్రెస్ ఉనికిని కోల్పోతుందన్నారు.