వరకట్న వేధింపులకు వివాహిత ఆత్మహత్య

వరకట్న వేధింపులకు వివాహిత ఆత్మహత్య
జగద్గిరిగుట్ట: వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైన ఘటన జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. విజయవాడ కృష్ణలంకకు చెందిన నాగరాజు.. తన కూతురు లక్ష్మీ ప్రసన్నను రాజమండ్రికి చెందిన సాదనాల కార్తీక్‌‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి సమయంలో వరకట్నంగా రూ.5 లక్షలు నగదు, 10 కాసుల బంగారం, నాలుగు సెంట్ల భూమిని ఇచ్చారు. అయితే వివాహం జరిగిన కొద్ది రోజులకే కార్తీక్ అదనపు డబ్బుల కోసం లక్ష్మీ ప్రసన్నను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. లక్ష్మీ ప్రసన్నను కార్తీక్ వేధిస్తుండటంతో ఆమె తండ్రి  అతడికి రూ.50 వేలను అందజేశాడు‌.‌ అయినా కార్తీక్ వేధించడం మానలేదు. దీంతో సోమవారం లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మీ ప్రసన్న చనిపోవడంతో కార్తీక్ ఆమె తండ్రికి ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. లక్ష్మీ ప్రసన్న ఉరి వేసుకొని చనిపోయిందని, ఫినాయిల్ తాగి మృతి చెందిందని, చేతిని కోసుకొని ఆత్మహత్య చేసుకుందని పలు రకాలుగా కార్తీక్ చెప్పడంతో.. అతడే ఆమెను హత్య చేసి, ఆత్మహత్యగా‌ చిత్రీకరించడానికి యత్నిస్తున్నాడని మృతురాలి తండ్రి నాగరాజు ఆరోపిస్తున్నాడు. నాగరాజు ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని జగద్గిరిగుట్ట సీఐ సైదులు తెలిపారు.