జవాన్ డ్రెస్ లో రెండేళ్ల కొడుకు : అమరుడైన నాన్నకు నివాళి

జవాన్ డ్రెస్ లో రెండేళ్ల కొడుకు : అమరుడైన నాన్నకు నివాళి

ఆ బాబుకు రెండేళ్లు నిండలేదు. ఐనా.. జవాన్ గా మారాడు. తన తండ్రికోసం సైనికుడిగా మారాడు. ఆర్మీ డ్రెస్ వేసుకున్నాడు. అమరుడైన నాన్నకు నివాళి అర్పించాడు. హృదయం ద్రవింపచేసిన ఈ సంఘటన తమిళనాడులో జరిగింది.

తమిళనాడుకు చెందిన ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు .. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయారు. సి. శివచంద్రన్, జి.సుబ్రహ్మణియన్ అనే ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. శివచంద్రన్ పార్థివదేహం ఈ ఉదయం తమిళనాడులోని అరియాలూరుకు చేరింది. అతడిది నిరుపేద కుటుంబం. కష్టపడి సైనికుడయ్యాడు. అతడే ఆ కుటుంబానికి జీవనాధారం.

నెలరోజుల సెలవు తర్వాత మొన్నటి ఫిబ్రవరి 9వ తేదీనే వెళ్లి సైన్యంలో కలిశాడు శివచంద్రన్. అప్పుడే ఆయన ఉగ్రవాదుల దాడిలో అమరుడయ్యాడని తెలిసి ఆ కుటుంబం తల్లిడిల్లిపోతోంది. వీర జవాన్ ను దేశానికి అందించిన ఆ తండ్రి కూడా సైనికుడు దుస్తులు ధరించాడు. తమ కుమారుడి మరణం తమకు బాధగా ఉన్నా.. దేశంకోసం ప్రాణాలర్పించడం గర్వంగా ఉందని బాధపడుతూనే చెప్పారు ఆ కుటుంబసభ్యులు.

శివచంద్రన్ భార్య కాంతిమతి ఇపుడు ప్రెగ్నెంట్. గర్భవతి అయినా కూడా ఆమె .. తన భర్త అంతిమయాత్రలో పాల్గొన్నారు. వీరి రెండేళ్ల కొడుకు సైనికుడిగా మారి.. నాన్నకు నివాళి అర్పించాడు.

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి.. అమరులైన తమ రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్లకు రూ.20లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు.