తెలంగాణలో మారుబెనీ పెట్టుబడులు 1,000 కోట్లు..ఫ్యూచర్ సిటీలో ఫస్ట్​ ఇండస్ట్రియల్​ పార్క్ ప్రాజెక్టు

తెలంగాణలో మారుబెనీ పెట్టుబడులు 1,000 కోట్లు..ఫ్యూచర్ సిటీలో ఫస్ట్​ ఇండస్ట్రియల్​ పార్క్ ప్రాజెక్టు
  • సీఎం రేవంత్​రెడ్డి జపాన్​ పర్యటనలో ఒప్పందం
  • ఫ్యూచర్​ సిటీలో నెక్స్ట్ జనరేషన్​ ఇండస్ట్రియల్ పార్క్​ ఏర్పాటుకు అంగీకారం
  • దశలవారీగా 600 ఎకరాల్లో అభివృద్ధి
  • లెటర్ ఆఫ్ ఇంటెంట్​పై ఆఫీసర్లు, కంపెనీ ప్రతినిధుల సంతకాలు
  • ఫ్యూచర్ సిటీలో ఫస్ట్​ ఇండస్ట్రియల్​ పార్క్​ ఇదే: సీఎం రేవంత్​
  • ప్రత్యక్షంగా, పరోక్షంగా 30వేల ఉద్యోగాలొస్తాయని వెల్లడి
  • సోనీ కంపెనీ హెడ్డాఫీస్​ను సందర్శించిన సీఎం టీమ్​
  • పెట్టుబడులకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఉన్న అనుకూలతలపై వివరణ

హైదరాబాద్​, వెలుగు: జపాన్​కు చెందిన ప్రముఖ కంపెనీ మారుబెనీ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్​లోని ఫ్యూచర్ సిటీలో నెక్ట్స్​ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్​ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దాదాపు రూ. 1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో  ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. దశలవారీగా 600 ఎకరాల్లో పార్క్ ను అభివృద్ధి చేయనుంది. 

జపాన్​ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్​రెడ్డి బృందాన్ని గురువారం టోక్యోలో మారుబేనీ కంపెనీ ప్రతినిధులు కలిశారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. లెటర్ ఆఫ్ ఇంటెంట్​పై సీఎం రేవంత్​ సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. 

ప్రభుత్వ మద్దతు ఉంటుంది: సీఎం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీకి మారుబేని కంపెనీని స్వాగతిస్తున్నట్లు సీఎం రేవంత్ ​రెడ్డి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొట్టమొదటి ఇండస్ట్రియల్​ పార్క్​ ఇదేనని, దీంతో రాష్ట్రంలో దాదాపు 30 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, జీవనోపాధి మెరుగుపడుతుందని పేర్కొన్నారు. 

మారుబేని కంపెనీ ప్రతినిధులతో చర్చల సందర్భంగా ఆయన మాట్లాడారు.  తెలంగాణలో వ్యాపారానికి అనువైన అవకాశాలున్నాయని, మారుబేని కంపెనీకి ప్రభుత్వం తరఫున తగినంత మద్దతు ఉంటుందని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, అందులో మారుబేని పెట్టుబడులకు ముందుకురావటం సంతోషంగా ఉందన్నారు. భారతదేశంతో జపాన్ కు ఏండ్లకేండ్లుగా ఉన్న స్నేహ సంబంధాల దృష్ట్యా  పెట్టుబడిదారులు తెలంగాణను తమ స్వస్థలంగానే భావిస్తారని సీఎం చెప్పారు. 

ముందు వరుసలో ఉంటం: మారుబేని

తెలంగాణను అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎంచుకున్న దార్శనికత అభినందనీయమని మారుబేని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  దై సకాకురా అన్నారు. తెలంగాణలో అవకాశాలను వినియోగించుకునేందుకు ముందువరుసలో ఉంటామని తెలిపారు. 

తెలంగాణ లక్ష్యాలకు తగ్గట్టు ప్రాజెక్ట్​

జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా నెక్ట్స్​ జనరేషన్  ఇండస్ట్రియల్ పార్క్​ను అభివృద్ధి చేస్తారు. దీంతో దాదాపు రూ. 5,000 కోట్లకు పైగా పెట్టుబడును ఆకర్షించే చాన్స్​ ఉంది. మారుబేని ఇండస్ట్రియల్ పార్క్ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్​, డిఫెన్స్ రంగాలపై దృష్టి పెడుతుంది. అధునాతన తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలను సృష్టించాలనే తెలంగాణ లక్ష్యాలకు తగ్గట్టు ఈ ప్రాజెక్టు చేపడతారని అధికార వర్గాలు తెలిపాయి. 

మారుబేని కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో 410 కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్తు, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్ లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్,  మొబిలిటీ రంగాల్లో ఈ కంపెనీ ముందు వరుసలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50వేల మందికి పైగా ఉద్యోగులను నియమించింది.

సోనీ కంపెనీతో చర్చలు..టోక్యో మెట్రో సందర్శన  

సీఎం రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం టోక్యోలోని మల్టీనేషన్ వ్యాపార దిగ్గజం సోనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. సోనీ కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కలుసుకుంది. తాము తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న కొత్త కార్యక్రమాలను కంపెనీ ప్రతినిధులు ప్రదర్శించారు. తమ పనితీరును వివరించారు. 

క్రంచైరోల్​ ప్రతినిధులతో సీఎం రేవంత్​రెడ్డి టీమ్​ చర్చలు జరిపింది. యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్ రంగాల్లో పెట్టుబడుల విస్తరణకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను కంపెనీ ప్రతినిధులకు వివరించింది. ఎండ్- టు -ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉండే అత్యాధునిక ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు సీఎం రేవంత్​రెడ్డి తన భవిష్యత్తు విజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంపెనీ ప్రతినిధులతో పంచుకున్నారు. 

కాగా.. టోక్యో మెట్రోను సీఎం రేవంత్​ రెడ్డి సందర్శించారు. అక్కడి మెట్రో ప్రయాణాలు, నిర్మాణం, ఇతర సదుపాయాలను పరిశీలించారు. సీఎం వెంట ఎంపీ రఘువీర్​రెడ్డి, ఉన్నతాధికారులు ఉన్నారు.