రూ.5,786 కోట్లు చెల్లించాలంటూ ఆటో మొబైల్కంపెనీ మారుతీ సుజుకీ ఇండియాకు ఆదాయపు పన్ను శాఖ నుంచి డ్రాఫ్ట్ అసెస్మెంట్ నోటీసులు అందాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొన్ని మినహాయింపులు, ఆదాయపు లెక్కల్లో తేడాల కారణంగా ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులను డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానెల్ ముందు సవాలు చేయనున్నట్లు కంపెనీ బీఎస్ఈకి తెలిపింది.
తమ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు రెండేళ్లలో 3.2 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించాయని, ఫలితంగా వినియోగదారులు రూ.8 కోట్ల విలువైన పెట్రోల్ ఆదా చేయడంతో పాటు, 385 మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాల తగ్గింపునకు తోడ్పడ్డారని ఈవీల తయారీ కంపెనీ ఓబెన్ ప్రకటించింది.
కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో తమ వాహనాలకు ఆదరణ బాగుందని తెలిపింది. 85 నగరాల్లో తమ షోరూమ్లు ఉన్నాయని పేర్కొంది. ఇసుజు మోటార్స్ ఇండియా ఈనెల 23–28 మధ్య దేశవ్యాప్తంగా ఐ-కేర్ ప్రీ-సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తోంది. డీ-మ్యాక్స్ పిక్-అప్, ఎస్యూవీ వాహనదారుల కోసం ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాహనాలకు ఉచితంగా తనిఖీలు చేస్తారు. స్పేర్పార్టులపై తగ్గింపు ఇస్తారు. హైదరాబాద్, విజయవాడ సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సర్వీసు సెంటర్లలో ఈ సదుపాయం ఉంటుంది.
