
- ఎల్బీ నగర్ లో వైశ్యవికాస వేదిక నిరసన ర్యాలీ
- మార్వాడీలకు వ్యతిరేకంగా ఆందోళన
ఎల్బీనగర్, వెలుగు: మార్వాడీలు హఠావో.. తెలంగాణ వ్యాపారుల బచావో అంటూ వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం ఎల్బీనగర్ లో నిరసన ర్యాలీ నిర్వహించారు. గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ 3 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. కాచం సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో తెలంగాణను ఆంధ్రాపాలకులు దోస్తే ఇప్పుడు గుజరాత్, రాజస్థానీ మార్వాడీలు దోస్తున్నారన్నారు.
తెలంగాణ వ్యాపారులను దెబ్బతీస్తూ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి అరాచకం సృష్టిస్తున్నారన్నారు. ఇక సహించేది లేదని తెలంగాణ నుంచి ఉరికించి కొడతామని హెచ్చరించారు. వైశ్య వికాస సభ్యులతో పాటు విశ్వకర్మ సంఘం లీడర్లు, పాండు రంగాచారి, రామాచారి, కార్మిక నాయకులు సల్వాచారి పర్వతం శ్రీను, ట్రేడ్ యూనియన్ లీడర్లు ఉప్పల శ్రావణ్ కుమార్ గుప్తా, కొత్త రవికుమార్, నిఖిల్, శ్రీధర్, తెలంగాణ యాదవ సంఘం ఉపేంద్ర యాదవ్ పాల్గొన్నారు.
మార్వాడీలూ తెలంగాణ బిడ్డలే..
బషీర్బాగ్ : మార్వాడీల భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్, డీజీపీలను కలుస్తామని అఖిల భారతీయ అగర్వాల్ మహాసభ తెలంగాణ అధ్యక్షుడు మహేశ్ అగర్వాల్ అన్నారు. కాచిగూడలో మాట్లాడుతూ రాజస్థాన్ నుంచి వందల ఏళ్ల క్రితమే మార్వాడీలతో పాటు వివిధ కులాలు, మతాలకు చెందిన ప్రజలు హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారన్నారు. నిజాం నవాబుల పాలన నుంచే ఇక్కడ ఉంటున్నామని, ఇప్పుడు కొందరు పనిగట్టుకుని గో బ్యాక్ ఉద్యమం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడైనా జీవించే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేశారు.