మార్వాడీ గో బ్యాక్ : తెలంగాణ పట్టణాల్లో వ్యాపారుల బంద్.. చాలా చోట్ల పోలీసుల మోహరింపు

మార్వాడీ గో బ్యాక్ : తెలంగాణ పట్టణాల్లో వ్యాపారుల బంద్.. చాలా చోట్ల పోలీసుల మోహరింపు

తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం  తీవ్ర రూపం దాల్చుతోంది. నిన్నటి వరకు  సోషల్ మీడియాలో మొదలైన ఈ నినాదం ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోకి వెళ్లింది. మార్వాడీలు ముఠాగా ఏర్పడి స్థానిక వ్యాపారస్థుల పొట్ట కొడుతున్నారని.. ఎదగనీయటం లేదని.. మార్వాడీలు తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని ఒక రాజకీయ యుద్ధమే మొదలైంది. ఎక్కడి నుంచో వచ్చిన మార్వాడీలు దాడులు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.   ఓయూ జేఏసీ పిలుపు మేరకు మార్వాడీలకు వ్యతిరేకంగా బంద్ పాటిస్తున్నారు వ్యాపారులు. పట్టణాల్లో షాపులను బంద్ చేస్తున్నారు. బంద్ పిలుపుతో చాలా చోట్ల భారీగా పోలీసులు మోహరించారు.   

 మార్వాడీ గో బ్యాక్ పేరుతో ఓయూ జేఏసీ ఆగస్టు 22న  తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఓయూ జేఏసీ పిలుపు మేరకు  పలు జిల్లాల్లో  బంద్  కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లాలో మార్వాడి గో బ్యాక్ బంద్ పిలుపు నేపథ్యంలో జమ్మికుంటలో  భారీగా మోహరించాయి పోలీసు బలగాలు.

 జమ్మికుంట పట్టణంలో బందు పాటిస్తున్నారు వ్యాపారులు.  బంధు సందర్భంగా పలువురు స్థానిక వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు  పోలీసులు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలో పలుచోట్ల పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. 

సిద్దిపేట జిల్లాలో  మార్వాడీ గో బ్యాక్ నినాదంతో దుబ్బాక జేఏసీ నాయకుల పిలుపు మేరకు విద్యా సంస్థలు, దుబ్బాక బంద్ కొనసాగుతోంది.

 రంగారెడ్డి జిల్లా అమనగల్ లో మార్వాడీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా ఓయూ జేఏసీ పిలుపు కు మద్దతుగా కిరాణా, వర్తక, వస్త్ర,స్వర్ణకార్ల షాప్ ల బందు  పాటిస్తున్నారు  వ్యాపారులు.

ఆగస్టు 21న అర్ధరాత్రి ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతిని పోలీసులు అరెస్ట్ చేశారు.  గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ గుజరాతి రాజస్థాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కొత్తపల్లి తిరుపతిని ఓయూ ఎన్ ఆర్ ఎస్ హెచ్ , పిహెచ్ డి(PhD) హాస్టల్ దగ్గర  టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ బంద్ కు  మద్దతు పెరగడంతో కొత్తపల్లి తిరుపతిని అదుపులోకి తీసుకుని  నల్లకుంట పోలీస్ స్టేషన్  కు తరలించారు. 

 సికింద్రాబాద్  మోండా మార్కెట్ లో ఓ దళితుడిపై మార్వాడీలు చేసిన దాడిని ఖండిస్తూ  ఆగస్టు 22న తెలంగాణ బంద్​కు పిలుపునిస్తున్నట్లు ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ప్రకటించారు.  అయితే  సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో తనపై జరిగిన దాడికి మార్వాడీలకు ఎలాంటి సంబంధం లేదని దాడిలో గాయపడిన బాధితుడు సాయి చెప్పారు. కేవలం తనకు, SK జువెల్లర్స్ కు మధ్య మాత్రమే వివాదం జరిగిందని తెలిపాడు.