ఇవాళ్టి (జులై 20) నుంచి మార్వాడీ మహిళా చైతన్య యాత్ర.. మహిళా సాధికారతపై అవగాహన

ఇవాళ్టి (జులై 20) నుంచి మార్వాడీ మహిళా చైతన్య యాత్ర.. మహిళా సాధికారతపై అవగాహన

నారాయణగూడ, వెలుగు: తెలంగాణలో ఈ నెల 20 నుంచి 24 వరకు మార్వాడీ మహిళా చైతన్య యాత్ర, మార్వాడీ మహిళా సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు అఖిల భారతీయ మార్వాడీ మహిళా సమ్మేళన్–సమాజ్ కల్యాణ్ సమితి జాతీయ అధ్యక్షురాలు రాజ్‌కుమారి బాల్డీ తెలిపారు. 

హైదరాబాద్ హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో నిర్వహించిన సమావేశంలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షురాలు శానూ వర్మ, జాతీయ ఉపాధ్యక్షురాలు లీలా బజాజ్, తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు శోభాజీ ఢాగాతో కలిసి ఆమె యాత్ర వివరాలను వెల్లడించారు. సోమవారం ఉదయం 7 గంటలకు హైదరాబాద్ కోఠి బడీచౌడీ ప్రాంతం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొనసాగుతుందని చెప్పారు. 

మార్వాడీ సమాజంలో మహేశ్వరీ, జైన్, ఖండేల్వాల్, బ్రాహ్మణ్, సునార్, పోర్వాల్, చౌరసీయ్, మెడత్వాల్, దసౌరా, నీమా, ప్రజాపత్, గుర్జర్, కుంబార్ తదితర 13 వర్గాలు ఉన్నాయని తెలిపారు. 'జహా జాతీ హై బైల్ గాడీ.. వహా జాయేగా మార్వాడీ..' అనే నినాదంతో మార్వాడీలు దేశవ్యాప్తంగా స్థిరపడి వివిధ వ్యాపారాల ద్వారా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. మార్వాడీ మహిళల సంక్షేమం, అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా తమ సంఘాలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయని తెలిపారు. 

తెలంగాణలో నిర్వహించే మహిళా సమ్మేళనాల ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఆరోగ్య, విద్య, ఉపాధి రంగాలతో పాటు మహిళా సాధికారతపై చైతన్యం కల్పిస్తామని చెప్పారు. భారతీయ మార్వాడీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, జాతీయ కళలు, గో సంరక్షణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఈ చైతన్య యాత్రను నిర్వహిస్తున్నట్లు వివరించారు.