నిజామాబాద్‌ జిల్లాలో మాస్క్‌ ఫ్రీ విలేజ్‌

V6 Velugu Posted on Jun 14, 2021

  • బిక్‌నెల్లి ఊరు.. మాస్క్‌ పెట్టుకోరు
  • ఊరు దాటి బయటకుపోతేనే పెట్టుకుంటరు
  • ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లలో ఎవరికీ కరోనా రాలె
  • తినేవన్నీ ఊర్లనే పండించుకుంటున్నరు
  • పప్పులు, ఉప్పుల కోసం నెలకోసారే బయటకు
  • వ్యవసాయ కూలీలకు ఊర్లనే పనిస్తున్నరు
  • పిల్లలు, వృద్ధులపై స్పెషల్‌ కేర్‌
  • పక్క ఊరోళ్లు వచ్చుడు లేదు.. వీళ్లు బయటకు పోవుడు లేదు

నిజామాబాద్, వెలుగు: ఈ కరోనా టైమ్‌లో బయటకు పోతే మాస్క్‌ కంపల్సరీ. పెట్టుకోకపోతే పక్కనున్నోళ్లే తిడ్తరు. పోలీసులైతే క్లాస్‌ పీకి మరీ ఫైనేస్తరు. కానీ నిజామాబాద్‌ జిల్లాలోని బిక్‌నెల్లి ఊర్లో మాత్రం ఎవరూ మాస్క్‌ పెట్టుకోరు. అట్లాగని వాళ్లకు కరోనా భయం లేదని కాదు. భయం కన్నా మంచి అవగాహనతో దాన్నుంచి బయటపడ్డరు. ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లలో ఊర్లో ఎవరికీ కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నరు. మహమ్మారిని జయించి మాస్క్‌ లేకుండా తిరుగుతున్నరు. 

మహారాష్ట్రకు 3 కిలోమీటర్ల దూరంలోనే.. 
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో మహారాష్ట్ర సరిహద్దున ఉంది బిక్‌నెల్లి గ్రామం. జనాభా 500. వీళ్లలో 40 మంది చిన్నారులు. వ్యవసాయం మీద ఆధారపడిన ఈ ఊరిలో భూమి లేని కొందరు చుట్టు పక్క గ్రామాల్లో కూలీకి వెళ్తుంటారు. బిక్‌నెల్లి జనాలకు ఐకమత్యం ఎక్కువ. గ్రామ సర్పంచ్ నాగకళ మాటకు కట్టుబడి ఉంటారు. 

గతేడాది మార్చిలో కరోనా ఫస్ట్‌‌‌‌ వేవ్‌‌‌‌ మొదలు కాగానే సర్పంచ్, హెల్త్​ సిబ్బంది గ్రామస్తులతో సమావేశమై కరోనా ఒకరి నుంచి ఒకరికి ఎలా సోకుతుందో, వృద్ధులకు సోకితే ఎంత ప్రమాదకరమో, దాన్ని ఎలా అడ్డుకోవచ్చో అవగాహన కల్పించారు. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారు. వీలైనంత వరకు ఎవరూ ఊరు దాటి బయటకు వెళ్లకుండా వేరే ఊర్ల నుంచి బిక్‌‌‌‌నెల్లికి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ ఊరికి 3 కిలోమీటర్ల దూరంలోనే మహారాష్ట్రలోని హునుందా గ్రామం ఉంటుంది. అక్కడి వాళ్లతో బిక్‌‌‌‌నెల్లి జనాలకు బంధుత్వం కూడా ఉంది. మహారాష్ట్రలో కేసులు ఎక్కువగా ఉండటంతో వీళ్లు మరింత జాగ్రత్త పడ్డారు. బంధువులను పిలవాల్సి వస్తుందని పెళ్లిళ్లు లాంటి శుభకార్యాలకు దూరంగా ఉన్నారు. ఊర్లోని వ్యవసాయ కూలీలకు సమస్య రావడంతో వారికి సాధ్యమైనంతవరకు ఊర్లోనే రైతుల పొలాల్లో పని చూపించి సమస్యను అధిగమించారు.

ఊర్లో పండిన జొన్నలు, కూరగాయలే.. 
బిక్‌‌‌‌నెల్లి ప్రజల ప్రధాన ఆహారం జొన్న, గోధుమ రొట్టెలు. పండుగల టైంలో తప్ప అన్నం తినరు. తమకు కావాల్సిన జొన్నలు, గోధుమలు, కూరగాయలన్నీ ఊర్లోనే పండించుకుంటారు. పిండిని గ్రామంలోనే మరాడించుకుంటారు. దీంతో తమకు వేరే ఊర్లకు వెళ్లాల్సిన అవసరం రాలేదని ఊరి వాళ్లు చెబుతున్నారు. కిరణా సామగ్రి కోసం 10 మంది నెలకోసారి ప్రత్యేకమైన వెహికల్‌‌‌‌లో బోధన్‌‌‌‌లో తెలిసిన షాపుకు వెళ్లి తెచ్చుకునేవాళ్లు. ఇందుకోసం గత 14 నెలల్లో 10 సార్లకు మించి వెళ్లలేదు. బోధన్‌‌‌‌ వెళ్లినప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటామని.. మాస్కులు, శానిటైజర్లు వాడతామని ఊరి వాళ్లు చెప్పారు. కూరగాయలతో పాటు గుడ్లు, ఆకు కూరలు, పండ్లు తినేవాళ్లమని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటామని చెబుతున్నారు.

మాస్క్‌‌‌‌ పెట్టుకుంటలేరు 
ఫస్ట్, సెకండ్ వేవ్ టైంలో ఊర్లోని ఏ ఒక్కరికీ కరోనా సోకలేదు. గ్రామం నుంచి రెగ్యులర్​గా బయటకు వెళ్లివచ్చేవారు ఇద్దరే ఇద్దరు. సర్పంచ్​ భర్త పిరాజి, పంచాయతీ సెక్రటరీ రవి. పిరాజి ప్రభుత్వ టీచర్​కావడంతో డ్యూటీకి వెళ్లాల్సి వచ్చేది. రవి వేరే ఊరి నుంచి వచ్చిపోతుంటాడు. వీరిద్దరూ ఒకరకంగా గ్రామంలో క్వారంటైన్‌‌‌‌లో ఉన్నట్టే ఉండేవారు. ఫిజికల్ డిస్టెన్స్ పాటించేవారు. ప్రస్తుతం ఊర్లో వీరిద్దరే కరోనా టీకా వేయించుకున్నారు. దీంతో వారిద్దరి నుంచి వైరస్ సోకుతుందనే భయం కూడా ఊరి వాళ్లకు పోయింది. దీంతో కొద్దిరోజుల క్రితం ఊరివాళ్లంతా తమ గ్రామాన్ని ‘మాస్క్​ ఫ్రీ విలేజ్​’గా ప్రకటించుకున్నారు. గ్రామంలో ఏ ఒక్కరికీ కరోనా లేనందున మాస్క్‌‌‌‌ అవసరం లేదని తీర్మానించుకున్నారు. ప్రస్తుతం ఊరి వాళ్లెవరూ తమ ఊర్లో ఉన్నంత సేపు మాస్క్‌‌‌‌ పెట్టుకోవట్లేదు. వేరే ఊరికి వెళ్తేనే ధరిస్తున్నారు. ఊర్లో మాస్క్‌‌‌‌ వాడకపోయినా ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తున్నామని చెబుతున్నారు.

Tagged Telangana, coronavirus, NIzamabad, bodhan, biknelli, coronafree village, mask free village

Latest Videos

Subscribe Now

More News