
ప్రతి ఏటా దీపావళికి భారత స్టాక్ మార్కెట్లలో ముహురత్ ట్రేడింగ్ పేరుతో ప్రత్యేక సెషన్ గంట పాటు నిర్వహించబడుతుంది. అయితే ఈసారి ఈ ట్రేడింగ్ సమయాన్ని ఎన్ఎస్ఈ, బీఎస్ఈ మార్చేశాయి. వాస్తవానికి దీపావళి సోమవారం అక్టోబర్ 20న కాగా.. స్టాక్ మార్కెట్లు దానిని ఆక్టోబర్ 21న జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో సాధారణంగా సాయంత్రం పూట నిర్వహించే ముహురత్ ట్రేడింగ్ ఈసారి మధ్యాహ్నానికి షిఫ్ట్ అయ్యాయి.
తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 21 మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 2.45 వరకు ఈ స్పెషల్ ట్రేడింగ్ సెషన్ నిర్వహించబడుతోంది. అలాగే 1.30 నుంచి 1.45 వరకు ప్రీ ఓపెన్ ట్రేడింగ్ సెషన్ ఉంటుందని వెల్లడైంది. అయితే ఈసారి టైమింగ్ ఎందుకు మారిందనే అనుమానం చాలా మందిలో ఉంది. కార్తీక అమావాస్య తేదీ ముగింపు కారణంగానే ట్రేడింగ్ టైమింగ్స్ మార్చినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది కార్తీక అమావాస్య అక్టోబర్ 20న మధ్యాహ్నం 3:44 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 21న సాయంత్రం 5:54 గంటలకు ముగుస్తుంది. దీని ఆధారంగానే ముహురత్ ట్రేడింగ్ గంటలు నిర్ణయం జరిగిందని వారు చెబుతున్నారు.
చాలా కాలం నుంచే ఈ ముహురత్ ట్రేడింగ్ పని గంటలను సాయంత్రం నుంచి మధ్యాహ్నానికి మార్చాలనే డిమాండ్ ఉంది. 13 ఏళ్ల కిందట 2012లో కూడా ఇలాగే ముహురత్ ట్రేడింగ్ మధ్యాహ్నం నిర్వహించబడింది. బ్రోకరేజ్ సంస్థలు దీపావళి ప్రత్యేక సెషన్‌ను మధ్యాహ్నానికి మార్చాలని లేదా ముహూర్త ట్రేడింగ్ కోసం పోస్ట్-ట్రేడ్ సమ్మతి అవసరాలను సడలించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఒక గంట ముహూర్త ట్రేడింగ్ వ్యవధి పెట్టుబడిదారులకు ఈక్విటీలు, డెరివేటివ్‌లు, కరెన్సీలు, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (SLB)లలో ట్రేడింగ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అలాగే గడచిన 10 ఏళ్ల కాలంలో 8 సార్లు ముహురత్ ట్రేడింగ్ లాభాల్లోనే ముగిసింది.