స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కేంద్రం సూచన

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కేంద్రం సూచన

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎక్కువ మందితో సమావేశాలు జరపకూడదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ప్రతిరోజూ సగటున 15 వేల పాజిటివ్  కేసులు నమోదవుతున్నందునా.. కరోనా నిబంధనలను అందరూ పాటించాలని స్పష్టం చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలో ఒక ప్రముఖ ప్రదేశంలో  నెల పాటు స్వచ్ఛందంగా 'స్వచ్ఛ భారత్' ప్రచారాన్ని నిర్వహించాలని చెప్పింది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు చెట్ల నాటే కార్యక్రమాలను చేపట్టాలని అన్ని ప్రభుత్వ శాఖలను హోం మంత్రిత్వ శాఖ సూచించింది.

16 వేలకు పైనే కొత్త కేసులు

దేశంలో గడిచిన ఒకరోజులో కొత్తగా 16,561 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. వైరస్ బారిన పడి 49 మంది చనిపోయారని చెప్పింది. దీంతో మొత్తం కేసులు 4.42 కోట్లు దాటగా.. మొత్తం మరణాల సంఖ్య 5,26,928కి చేరుకుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,23,535 కి తగ్గాయి. రికవరీ రేటు 98.53 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 5.44 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. తాజా మరణాల్లో 10 కేరళకు చెందినవేనని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 207.47 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.