- రాష్ట్రంలో ఏడు వేల మందికి ఉద్యోగావకాశాలు
- టీసీఎస్ అనుబంధ హైపర్ వాల్ట్‌తో ఒప్పందం
- ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో అగ్రిమెంట్
- 2028 జూన్ 2 నాటికి పూర్తి చేయాలన్న సీఎం
హైదరాబాద్, వెలుగు: దేశంలోనే అతిపెద్ద ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డేటా సెంటర్ క్యాంపస్ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. ఫ్యూచర్ సిటీ వేదికగా ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) అనుబంధ సంస్థ ‘హైపర్ వాల్ట్’ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు రూ.70 వేల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ మెగా ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ ఒప్పందానికి సంబంధించిన కీలక సమావేశం శనివారం సెక్రటేరియెట్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగింది. సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, టీసీఎస్ సీఈఓ కె. కృతివాసన్, సీఓఓ ఆర్తి సుబ్రమణియన్, హైపర్ వాల్ట్ ప్రెసిడెంట్ వి. రాజన్న, సీఈఓ దీపేష్ నందా పాల్గొన్నారు.
అలాగే అమెరికా నుంచి ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉదయ్ రుద్రరాజు వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు తెలంగాణకే కాకుండా యావత్ దేశానికే గర్వకారణమని, హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ హబ్‌గా నిలపాలన్న తన కల నెరవేరుతున్నదని తెలిపారు.
మాకు పాలసీ పెరాలసిస్ ఉండదు..
రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధానాల అమలులో ఎలాంటి ‘పాలసీ పెరాలసిస్’ ఉండబోదని సీఎం రేవంత్ పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. 1994- నుంచి 2004 మధ్య చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం, ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మంచి పాలసీలను మరింత ముందుకు తీసుకెళ్తున్నామని, ఎక్కడా వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. తమకు ఇతర పార్టీలతో రాజకీయ, సిద్ధాంతపరమైన విభేదాలు ఉండవచ్చని, కానీ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ విషయంలో ఏకాభిప్రాయంతో ఉంటామని తేల్చిచెప్పారు. తెలంగాణ పక్కనున్న ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడుతో పోటీ పడడం లేదని.. సింగపూర్, చైనా, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి అగ్రదేశాలే తమకు పోటీ అని తెలిపారు. టీసీఎస్ తన పెట్టుబడులను, ఉద్యోగాలను రెట్టింపు చేస్తే తాము కూడా అందుకు తగ్గట్టుగా రాయితీలను, అనుమతులను రెట్టింపు వేగంతో అందిస్తామన్నారు.
ఫ్యూచర్ సిటీ రేడియల్ రోడ్డుకు టాటా పేరు..
ఏఐ డేటా సెంటర్ రెండేండ్లలో సిద్ధం కావాలని సీఎం రేవంత్ డెడ్ లైన్ విధించారు. 2028 జూన్ 2( తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) నాటికి దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను ప్రారంభించేలా పనులు పూర్తిచేయాలని నిర్దేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ఈ భారీ ఏఐ సెంటర్ బలమైన పునాది వేసిందని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలకు అనుకూలంగా ఔటర్ రింగ్ రోడ్డు కొంగర కలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 50 కిలోమీటర్ల మేర ఎలాంటి ఆటంకాలు లేని 90 డిగ్రీల స్ట్రెయట్ అలైన్‌మెంట్‌తో ‘రేడియల్ రోడ్డు నంబర్-1’ను అత్యున్నత ప్రమాణాలతో నిర్మిస్తున్నామని తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ రోడ్డుగా నిలవనున్న ఈ రహదారిని భవిష్యత్తులో విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు, టేకాఫ్ తీసుకునేందుకు వీలుగా రన్‌వే (ఏరోడ్రోమ్) స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెచ్చే సంస్థలకు ఇచ్చిన మాట ప్రకారం.. దేశ పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా నిలిచిన దివంగత పారిశ్రామికవేత్త, భారతరత్న రతన్ టాటా స్మారకార్థం ఈ 50 కిలోమీటర్ల రేడియల్ రోడ్డుకు ఆయన పేరు పెడతామని సీఎం ప్రకటించారు.
ఉద్యోగాలు లక్ష మార్కును చేరాలే..
రాష్ట్రంలో టాటా సంస్థ ఇప్పటివరకు 85 వేల మందికి ఉపాధి కల్పించిందని.. తాజా ప్రాజెక్టుతో కలిపి ఈ సంఖ్యను త్వరలోనే లక్ష మార్కుకు చేర్చాలని టీసీఎస్‌కు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ విస్తృతి వల్ల సాంకేతిక, కోడింగ్ నిపుణుల కొలువులపై ప్రభావం పడుతుందనే చర్చ సాగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలోని బ్లూ కాలర్ ఉద్యోగాలను ఏఐ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదన్నారు. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, వాటర్ నిపుణులు వంటి సాంకేతిక రంగాల వారి భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదన్నారు. స్థానిక నిరుద్యోగ యువతకు ఈ భారీ ప్రాజెక్టు ద్వారా సురక్షితమైన, శాశ్వత ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇందుకోసమే టాటా డేటా సెంటర్ ప్రాజెక్టు వెంచర్‌కు సమీపంలోనే ప్రతిష్టాత్మక ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ప్రభుత్వం నెలకొల్పిందని వివరించారు. ఈ వర్సిటీ ద్వారా స్థానిక యువతకు కార్పొరేట్ ప్రమాణాలతో కూడిన సాంకేతిక, నైపుణ్య శిక్షణను అందించి, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులుగా తీర్చిదిద్ది ఉద్యోగ భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
పారదర్శకంగా తెలంగాణ రైజింగ్ పాలసీ..
రాష్ట్ర సమగ్ర ఆర్థిక పురోగతి కోసం ప్రభుత్వం పవర్, టూరిజం, స్పోర్ట్స్, హెల్త్, ఇన్వెస్ట్‌మెంట్ రంగాల్లో తీసుకొచ్చిన ‘తెలంగాణ రైజింగ్ పాలసీ’ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. రాష్ట్రాన్ని 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ అంతిమ లక్ష్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ‘వికసిత్ భారత్-2047’ లక్ష్యమైన 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలక భాగస్వామిగా మారనుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ జనాభాలో తెలంగాణ వాటా కేవలం 2.5 శాతం మాత్రమే అయినప్పటికీ, జాతీయ జీడీపీకి ఇప్పటికే 5 శాతం సహకారాన్ని అందిస్తోందని గుర్తుచేశారు. జనాభా స్థిరీకరణ సాధించినప్పటికీ, ఆర్థిక సంస్కరణలతో ఈ వాటాను ఏకంగా10 శాతానికి పెంచడమే తమ సంకల్పమని చెప్పారు. ఈ లక్ష్యాలను అందుకోవడానికి ఫార్చ్యూన్ 500 సహా అంతర్జాతీయ సంస్థల విస్తృత భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు.
ఫ్యూచర్ సిటీ రేడియల్ రోడ్డుకు టాటా పేరు
ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 50 కిలోమీటర్ల మేర 90 డిగ్రీల స్ట్రెయిట్ అలైన్‌మెంట్‌తో ‘రేడియల్ రోడ్డు నంబర్-1’ను నిర్మిస్తున్నాం. విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు, టేకాఫ్ తీసుకునేందుకు వీలుగా రన్‌వే (ఏరోడ్రోమ్) స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నాం. ఈ 50 కిలోమీటర్ల రేడియల్ రోడ్డుకు భారతరత్న రతన్ టాటా పేరు పెడతాం. - సీఎం రేవంత్‌రెడ్డి
హై కెపాసిటీ కంప్యూటింగ్.. అత్యాధునిక ‘లిక్విడ్ కూలింగ్’
హైదరాబాద్ పరిధిలో 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఒక గిగావాట్ భారీ విద్యుత్ సామర్థ్యంతో ఈ అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను హైపర్ వాల్ట్ తన భాగస్వామ్య సంస్థలతో కలిసి అభివృద్ధి చేయనుంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఏఐ సంస్థలు, హైపర్ స్కేలర్లు, అంతర్జాతీయ ఎంటర్‌ప్రైజెస్‌లకు అవసరమైన భారీ కంప్యూటింగ్ మౌలిక వసతులను కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. అధిక సామర్థ్యమున్న కంప్యూటింగ్ వ్యవస్థలు, అత్యంత ఆధునికమైన ‘లిక్విడ్ కూలింగ్’ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పర్యావరణహితమైన గ్రీన్ ఎనర్జీ, వాటర్-న్యూట్రల్ డిజైన్‌తో ఈ క్యాంపస్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు సాధన వెనుక దావోస్ వేదికగా జరిగిన చర్చలు కీలక పాత్ర పోషించాయి. 2026 జనవరిలో దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మధ్య జరిగిన ప్రాథమిక సమావేశం అనంతరం, దేశంలోని మరో ఐదు రాష్ట్రాల నుంచి తీవ్ర పోటీ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో వ్యవహరించి ఈ ప్రాజెక్టును దక్కించుకుంది.
