నిధుల గోల్మాల్కు భారీ స్థాయిలో కుట్ర

నిధుల గోల్మాల్కు భారీ స్థాయిలో కుట్ర
  • ఒక్కడే.. రెండు భారీ స్కామ్ లు..
  • తెలుగు అకాడమీ స్కామ్ బయటపడడంతో.. గిడ్డంగుల సంస్థ ప్లాన్ ఫెయిల్

హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో నిధుల గోల్ మాల్ కు భారీ స్థాయిలో కుట్ర జరిగింది. సంస్థకు చెందిన ఫిక్స్ డ్ డిపాజిట్లు కాజేసేందుకు జరిగిన ప్రయత్నం విఫలమైంది. తెలుగు అకాడమీలో జరిగిన నిధులు గోల్ మాల్ వెనకున్న సూత్రధారే ఇక్కడా చక్రం తిప్పినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో నిధుల గోల్ మాల్ కు జరిగిన భారీ కుట్ర బయటపడింది. ఇప్పటికే తెలుగు అకాడమీలో కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టించగా.. ఇప్పుడు గిడ్డంగుల సంస్థకు చెందిన 3కోట్ల 98లక్షలు కాజేసేందుకు ప్లాన్ చేశారు.

తెలుగు అకాడమీలో నిధుల గోల్ మాల్ వెనకున్న సూత్రధారులే ఈ కుట్రకు స్కెచ్ వేసినట్లు అనుమానిస్తున్నారు. తెలుగు అకాడమీ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారి మస్తాన్ వలీ సాహెబ్.. మరో భారీ స్కామ్ కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర గిడ్డంగుల శాఖకు చెందిన 3కోట్ల 98లక్షల రూపాయలను కార్వాన్ యూనియన్ బ్యాంక్ నుంచి కాజేసే యత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెలుగు అకాడమీ FDలతో పాటు గిడ్డంగుల శాఖ FDలను కొల్లగొట్టేందుకు ఒకేసారి ప్లాన్ చేసినా.. తెలుగు అకాడమీ స్కామ్ బయటపడటంతో గిడ్డంగుల స్కామ్ ఫెయిలైందని తెలుస్తోంది. 
గిడ్డంగుల శాఖ ఫిక్స్ డ్ డిపాజిట్లకు చెందిన ఫోర్జరీ పేపర్లు సృష్టించాడని మస్తాన్ వలీపై యూనియన్ బ్యాంక్ కార్వాన్ బ్రాంచ్ మేనేజర్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే తెలుగు అకాడమీ స్కామ్ కేసులో మస్తాన్ వలీ చంచల్ గూడ జైలులో ఉన్నాడు. దీంతో గిడ్డంగుల శాఖ కేసులో మస్తాన్ వలీని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు సీసీఎస్ పోలీసులు. 
తెలంగాణ గిడ్డంగుల సంస్థకు వచ్చే మిగులు ఆదాయాన్ని కొన్ని బ్యాంకుల్లో గిడ్డంగుల సంస్థ పేరుపైనే ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తారు. ఇందులో భాగంగానే హైదరాబాద్  కార్వాన్  ప్రాంతంలోని యూబీఐ, ఎస్బీఐ బ్యాంకుల్లో గతేడాది జనవరి 6న.. కోటి 90 లక్షలు, 7న మరో కోటి 90 లక్షలు ఫిక్స్ డ్  డిపాజిట్  చేశారు. ఈనెల 6, 7 తేదీలకు ఏడాది కావడంతో డిపాజిట్లను విత్ డ్రా చేసుకునేందుకు సంస్థ అధికారులు బ్యాంకును సంప్రదించారు.

అయితే ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసిన రశీదులు బ్యాంకు అధికారులకు చూపించగా అవి నకిలీవని తేల్చారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆన్ లైన్  వివరాలను బ్యాంకు అధికారులకు చూపించగా.. నకిలీ రశీదు స్థానంలో మరో రశీదును అందించి నిధులను సంస్థ ఖాతాలో వడ్డీతో కలిపి జమచేశారు. తెలుగు అకాడమీ నిధుల వ్యవహరం, గిడ్డంగుల సంస్థ వ్యవహారం రెండూ కార్వాన్  ఏరియాలోని యూనియన్  బ్యాంకులోనే జరగడంతో నిధుల గోల్ మాల్ లో గత అధికారి మస్తాన్ వలి సాహెబ్ పాత్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గిడ్డంగుల సంస్థ బ్యాంకులో నగదును డిపాజిట్  చేసిన సమయంలో తెలుగు అకాడమీ నిధులను కాజేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకు అధికారే ఉండడం కూడా ఇందుకు బలం చేకూరుస్తోంది. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతోంది.