ఈఎస్​ఐలో వందల కోట్ల లూటీ?

ఈఎస్​ఐలో వందల కోట్ల లూటీ?
  • మొన్న మందుల కొనుగోళ్ల బాగోతం
  • తాజాగా మెడికల్​ కిట్లు, వైద్య పరికరాల్లో భారీ అవినీతి
  • కార్మిక శాఖ అంతర్గత విచారణలో వెల్లడి!
  • ఏసీబీకి  కార్మిక శాఖ ఉన్నతాధికారి లేఖ
  • రెండ్రోజులుగా ఏసీబీ, ఆడిటింగ్​ అధికారుల దర్యాప్తు

హైదరాబాద్, వెలుగురాష్ట్ర ఈఎస్ఐలో బయటపడ్డ మందుల కొనుగోళ్ల స్కాంపై తీగలాగిన కొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.  సుమారు రూ. 200 కోట్ల కొనుగోల్​మాల్​ జరిగిందని ఇప్పటికే విజిలెన్స్​ విచారణలో తేలింది. దీంతో ఈఎస్​ఐ అవినీతి బాగోతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది. అదే కోణంలో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్​ అధికారులు మరో అడుగు ముందుకు వేశారు. కోట్లాది రూపాయల స్కాం కావడంతో అంతర్గత విచారణ చేపట్టాలని కార్మిక శాఖకు సూచించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన కార్మిక శాఖ ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. మందుల కొనుగోళ్లతోపాటు మరిన్ని అక్రమాలు జరిగినట్లు కమిటీ విచారణలో ప్రాథమికంగా బయటపడినట్లు తెలిసింది. 2015 నుంచి ఇప్పటివరకు మెడికల్​ కిట్స్, వైద్య పరికరాల కొనుగోళ్ల పేరిట కొందరు అధికారులు కోట్లాది రూపాయలు లూటీ చేసినట్లు కమిటీ పలు ఆధారాలను సేకరించినట్లు సమాచారం. ఈ వివరాలను ప్రస్తావిస్తూ కార్మిక శాఖ ఉన్నతాధికారి జూన్​ చివరివారంలో ఏసీబీకి లేఖరాసినట్లు తెలుస్తోంది. గత నాలుగేండ్లలో ఈఎస్​ఐలో పెద్ద ఎత్తున ప్రజాధనం లూటీ అయిందని, వీటిపై వీలైనంత త్వరగా దర్యాప్తు జరపాలని ఆ అధికారి తన లేఖలో కోరినట్లు సమాచారం. ఈ మేరకు రెండురోజులుగా ఈఎస్​ఐ ప్రధాన కార్యాయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆడిటింగ్​ అధికారులు కూడా సోదాల్లో పాల్గొంటున్నారు. పలు ఫైళ్లను, కీలక డాక్యుమెంట్లను వారు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కార్మిక శాఖ తన అంతర్గత విచారణలో వెల్లడైన పలు ఆధారాలను కూడా ఏసీబీ అధికారులకు ఇచ్చినట్లు తెలిసింది.

5 రెట్లు ఎక్కువ ధరకు కిట్స్కొనుగోలు!

ఈఎస్​ఐలో కొందరు నిబంధనలు ఉల్లంఘించి మార్కెట్​ రేట్ల కన్నా 5 రెట్లు ఎక్కువ ధరకు మెడికల్​ కిట్స్​, ఇతర వైద్యపరికరాలు కొనుగోలు చేసినట్లు కార్మిక శాఖ అంతర్గత కమిటీ ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అవసరం లేకున్నా కోట్ల రూపాయలతో కిట్స్,అనలైజర్లను, పలు వైద్య పరికరాలను కొనుగోలు చేశారని, ఎక్స్ పైరీ అయిన వందలాది కిట్లను కొన్ని కంపెనీల ద్వారా కొనుగోలు చేసి ఆయా కంపెనీలకు పెద్ద ఎత్తున బిల్లులు సమర్పించినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు సమాచారం. కిట్లు, ఎక్విప్ మెంట్స్​ ను ఈఎస్ఐ డిస్పెన్సరీలకు డిస్పాచ్ చేసినట్లుగా ఇక్కడి కొందరు అధికారులు తప్పుడు రికార్డులు సృష్టించినట్లుగా కూడా కమిటీ తేల్చినట్లు తెలుస్తోంది. ఈ తాజా వ్యవహారంలో కీలక అధికారుల పాత్ర ఉన్నట్లు కమిటీ అనుమానిస్తోంది.

ఫిబ్రవరిలో మందుల కొనుగోళ్ల స్కాంపై రిపోర్టు

ఈఎస్ఐలో మందుల కొనుగోళ్లలో భారీగా అవినీతి జరిగినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విజిలెన్స్ అధికారులు ఓ రిపోర్టును ప్రభుత్వానికి అందజేశారు. ఈఎస్ఐ డైరెక్టర్ అక్రమాలకు పాల్పడినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. డొల్ల కంపెనీల పేర్లను, వాటి వివరాలను, ఆధారాలను అందులో పొందుపరిచారు.  మందుల కొనుగోళ్ల వ్యవహారంలో ఈఎస్ఐ డైరెక్టర్ ను కూడా విజిలెన్స్ అధికారులు విచారించారు. ఈ నివేదిక ప్రభుత్వానికి సమర్పించి ఇప్పటికి ఐదారు నెలలు గడుస్తు్న్నా సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అవినీతిపరులను వెంటనే శిక్షించాలి: సీపీఎం

ఈఎస్ఐ కుంభకోణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. మంగళవారం ఈఎస్ఐ కార్యాలయం వద్ద పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ  సందర్భంగా సీపీఎం నేత ఎం.శ్రీనివాస్​ మట్లాడుతూ విజిలెన్స్ కమిటీ నివేదిక ఇచ్చి ఐదారునెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కార్మికుల సొమ్ము ను కొందరు అడ్డగోలుగా తింటూ ఈఎస్ఐ కార్యాలయాన్ని కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న ఈఎస్ఐ డైరెక్టర్​తోపాటు వైద్య పరికరాలు, కిట్స్ కొనుగోళ్లలో భారీగా కుంభకోణాలకు పాల్పడిన అధికారులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్​ చేశారు. చర్యలు తీసుకోకపోతే భారీ ఉద్యమాలు తప్పవని ఆయన హెచ్చరించారు.