నన్నే ఆపుతారా.. : ఫెన్సింగ్ దూకి వెళ్లిన మాజీ సీఎం

నన్నే ఆపుతారా.. : ఫెన్సింగ్ దూకి వెళ్లిన మాజీ సీఎం

లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు  సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్  లక్నోలోని జేపీఎన్‌ఐసీకి చేరుకున్నారు. అయితే ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో  అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అఖిలేష్ యాదవ్  ను అడ్డుకునేందుకు  పోలీసులు  జేపీఎన్‌ఐసీ గేటుకు తాళం వేసి చూట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.  

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అఖిలేష్ యాదవ్ గేటుపై నుండి దూకి లోపలికి ప్రవేశించారు. ఆయన అనుచరులు కూడా దీనినే అనుసరించారు.  లోపలికి ప్రవేశించిన అఖిలేష్  జయప్రకాష్ నారాయణ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  అనంతరం మీడియాతో మాట్లాడిన అఖిలేష్  రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తోందని ఆరోపించారు.  సంపూర్ణ క్రాంతిలో జేపీ హీరో అని ఆయన కొనియాడారు.  

 2012-17లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అఖిలేష్ యాదవ్ జేపీఎన్‌ఐసీ సముదాయాన్ని నిర్మించారు. కానీ  భవనం ఇప్పటికీ అసంపూర్తిగా ఉంది. భవనం పనులు ఇంకా పూర్తి కానప్పటికీ, భవనం లోపల జయప్రకాష్ నారాయణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం అఖిలేష్  ఆయన  విగ్రహానికి పూలమాల వేస్తారు. కానీ ఈ సారి పోలీసులు అఖిలేష్ ను అడ్డుకున్నారు.