గచ్చిబౌలిలో అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్మెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముగ్గురికి తీవ్ర గాయాలవ్వగా 15 బైకులు పూర్తిగా దగ్దమయ్యాయి. సోమవారం ( ఏప్రిల్ 20 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఎన్జీవో కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో అగ్నిప్రమాదం జరిగింది. సెల్లార్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలవ్వగా 15 బైకులు పూర్తిగా దద్గమయ్యాయి.
ఈ ఘటనపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మూడు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మాదాపూర్ DFO కరీముల్లా మాట్లాడుతూ..
ఇవాళ ఉదయం 7:30 గంటల సమయంలో అగ్నిప్రమాదం గురించి తమకు సమాచారం వచ్చిందని తెలిపారు DFO కరీముల్లా. బిల్డింగ్ సెల్లార్ లో షార్ట్ సర్క్యూట్ వల్లే భారీ ఎత్తున మంటలు ఎగసి పడ్డాయని అన్నారు. దట్టమైన పొగ వల్ల ముగ్గురు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారని.. ప్రస్తుతం ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. క్షతగాత్రులకు కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రమాదంలో సెల్లార్ లో ఉన్న 15 పూర్తిగా కాలిపోయాయని తెలిపారు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తీసుకురాగలిగామని అన్నారు. సెల్లార్ ను పార్కింగ్ కోసం తప్ప దేనికీ వాడకూడదని.. ఇప్పటికే చాలా అవగాహనా కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.
ప్రమాదం జరిగిన బిల్డింగ్ సెల్లార్ లో సోఫాలు ఉన్నట్లు గుర్తించామని.. ఫర్నిచర్ ఉండటం వల్లే మంటలు త్వరగా వ్యాపించాయని అన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. బిల్డింగ్ ఓనర్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు DFO కరీముల్లా.

