హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం... మంటల్లో చిక్కుకున్న నెలరోజుల పసికందు...

హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం... మంటల్లో చిక్కుకున్న నెలరోజుల పసికందు...

హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. మూడు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గురువారం ( మే 15 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహారాజ్ గంజ్ లో ఓ బిల్డింగ్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.. బిల్డింగ్ మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో నెలరోజుల పసికందు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ఆరు ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. నెలరోజుల పసికందు సహా మంటల్లో చిక్కుకున్న ఏడుగురిని సురక్షితంగా కిందకు తెచ్చారు ఫైర్ ఫైటర్స్. బ్రాండో స్కై లిఫ్ట్ ద్వారా మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడిన ఫైర్ సిబ్బంది.

భారీ ల్యాడర్ ద్వారా రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది.సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించటంతో  దీంతో పెను ప్రమాదం తప్పింది.మొదటి అంతస్తు నుంచి రెండు మూడు అంతస్తులకు భారీగా మంటలు వ్యాపించడంతో నాలుగు ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు ఫైర్ సిబ్బంది. ప్రమాదం జరిగిన భవనంలో ప్లాస్టిక్ గోదాం ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయని తెలుస్తోంది. 

షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించామని తెలిపారు ఫైర్ సిబ్బంది. ఈ ఘటనలో ప్రాణ నష్టమేమీ సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి తమ ప్రాణాలు కాపాడినందుకు ఫైర్ సిబ్బందికి కృతఙ్ఞతలు తెలిపారు బాధితులు.