అగ్ని ప్రమాదంతో..ఉలిక్కిపడిన టోలిచౌకి

అగ్ని ప్రమాదంతో..ఉలిక్కిపడిన టోలిచౌకి
  •     20 ఏండ్లుగా గోదాంలో భారీగా ఇంజన్ ఆయిల్​నిల్వలు
  •     ప్రమాద సమయంలో గోదాంలో లక్షన్నర లీటర్ల ఆయిల్
  •     పెట్రోల్​బంక్​కు మంటలు వ్యాపిస్తాయని భయపడిపోయిన స్థానికులు 

హైదరాబాద్/మెహిదీపట్నం, వెలుగు : ఇంజన్​ఆయిల్ నిల్వలున్న గోదాంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంతో టోలిచౌకి ఉలిక్కిపడింది. ఏడు ఫైర్​ఇంజన్లతోపాటు వాటర్​బోర్డుకు చెందిన వాటర్​ట్యాంకర్ల సాయంతో ఫైర్​సిబ్బంది శనివారం తెల్లవారుజామున మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలను ఆర్పేందుకు ఐదారు గంటలు శ్రమించాల్సి వచ్చింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రూ.5 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని హుమయూన్ నగర్ ఇన్​స్పెక్టర్ సైదేశ్వర్ తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన రోటెక్స్ బైక్ ఇంజన్ ఆయిల్ గోదాంను ఆనుకుని పెట్రోలు బంక్ ఉండడంతో, ఎక్కడ మంటలు వ్యాపిస్తాయోనని స్థానికులు, అధికారులు ఆందోళనకు గురయ్యారు. మంటలు అదుపులోకి వచ్చే వరకు బిక్కుబిక్కుమన్నారు. ప్రమాద సమయంలో గోదాంలో లక్షన్నర లీటర్ల ఇంజన్ ఆయిల్​ఉంది. మంటలు అంటుకున్నాక ఆయిల్​అంతా పెట్రోల్​బంక్​ముందున్న నేషనల్​హైవే పారింది. దీంతో పోలీసులు రోడ్డును బ్లాక్​చేశారు. ట్రాఫిక్​ను అవతలి వైపు రోడ్డు నుంచి మళ్లించారు. నిర్వాహకుడు రత్నాకర్​20 ఏండ్లుగా గోదాంలో భారీ మొత్తంలో ఇంజన్​ఆయిల్​నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోంది.  అగ్ని ప్రమాదంతో హైవేపై ఉన్న పెట్రోల్ బంకును, మెహిదీపట్నం వైపు ఫ్లైఓవర్​ను శనివారం మూసివేశారు. హైవేపై ఇంజన్​ఆయిల్ పేరుకుపోవడంతో లారీల్లో మట్టిని తెప్పించి రోడ్డుపై చల్లించారు. అయితే శనివారం ఘటనా స్థలంలోకి మీడియాను అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

రోజంతా ట్రాఫిక్​ జామ్​

అగ్ని ప్రమాదం, హైవేపై ఇంజన్​ఆయిల్​పేరుకుపోవడంతో శనివారం ఉదయం టోలిచౌకి, నానల్ నగర్ చౌరస్తాతోపాటు లంగర్ హౌస్ నుంచి వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. టోలిచౌకి వైపు వెళ్లే వాహనాలను ఫ్లోర్ మిల్ సమీపంలోని ఎండీ లైన్స్ మీదుగా మళ్లించారు. టూవీల్స్ ను సాలార్జంగ్ కాలనీ నుంచి పోనిచ్చారు. రోజంతా వెహికల్స్​ మూవ్​మెంట్​ నెమ్మదిగా సాగింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహినుద్దీన్ సమీక్షించారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

గోదాంకు అనుమతులు ఉన్నాయా?

అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నట్లు హుమయూన్ నగర్ ఇన్​స్పెక్టర్ సైదీశ్వర్ తెలిపారు. ఆయిల్ గోదాంకు అనుమతులు ఉన్నాయో లేదో తెలియలేదు. సిటీ మధ్యలో, జనావాసాల మధ్య ఇంత పెద్ద మొత్తంలో ఆయిల్​నిల్వ చేయడంపై జనం మండిపడుతున్నారు. గతేడాది నాంపల్లి బజార్ ఘాట్​లో జరిగిన ప్రమాదంలో 9 మంది మృతి చెందినా, అధికారులు ఇలాంటి గోదాంలపై చర్యలు తీసుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేస్తున్నారే తప్ప, తర్వాత పట్టించుకోవడం లేదని జనం మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గోదాంలను శివారు ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.

అగ్ని ప్రమాదంపై నివేదిక ఇవ్వండి : కలెక్టర్

ఆయిల్ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. టోలిచౌకిలోని యూసుఫ్ టేక్రి పెట్రోల్ బంక్ వెనకాల ఉన్న రోటెక్స్ ఇంజన్ ఆయిల్ గోదాంను శనివారం ఉదయం 6 గంటలకు కలెక్టర్​సందర్శించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాద తీవ్రత, ఎలా జరిగిందనే విషయాలు తెలుసుకున్నారు. సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చిన వాటర్ వర్క్స్, అగ్నిమాపక సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ దశరథ్ సింగ్, జీహెచ్ఎంసీ ఈఈ వెంకట శేషయ్య, వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ మహేందర్ నాయక్, షేక్ పేట తహసీల్దార్ అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.