HDFC బ్యాంక్ వ్యవసాయ రుణాల పేరుతో భారీ మోసం

HDFC బ్యాంక్ వ్యవసాయ రుణాల పేరుతో భారీ మోసం

విజయవాడ: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వ్యవసాయ రుణాల పేరుతో కొందరు కేటుగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. లోన్ ఇప్పిస్తామని చెప్పి సురేష్ అనే ఓ యువరైతు నుంచి లక్షలు దండుకున్నారు.  ఏపీలోని విజయవాడలో ఈ మోసం వెలుగుచూసింది. రూ.4 కోట్ల లోన్ ఇప్పిస్తామని చెప్పి..  లోన్ ప్రాసెసింగ్ ఫీజులు, స్టాంప్ డ్యూటీలు, ఇన్స్యూరెన్స్ ఛార్జీలలో పాటు, కమీషన్ల పేరుతో బాధితుడి నుంచి దాదాపు ఐదు లక్షల రూపాయల వరకూ దోచుకున్నారు. మూడు నెలలైనా…  ఎలాంటి రుణం మంజూరు కాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు వారికిచ్చిన డబ్బులు, ఆస్తిపత్రాలు తిరిగిచ్చేయాలని కోరాడు.  ఆస్తిపత్రాలు తిరిగివ్వాలంటే రూ.2 లక్షలు చెల్లించాల్సివుంటుందని మోసగాళ్లు బెదిరింపులకు పాల్పడడంతో తాను మోసపోయానని గ్రహించిన సురేష్ కుమార్ తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు కృష్ణలంక పోలీసులు వెల్లడించారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు అగ్రి లోన్స్ విభాగానికి చెందిన శ్రీనివాస చక్రవర్తి, సుధాకర్ లతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.