గుజరాత్ ఇంజనీర్ల మహా అద్బుతం : ప్రారంభోత్సవం రోజే కూలిన 21 కోట్ల వాటర్ ట్యాంక్

గుజరాత్ ఇంజనీర్ల మహా అద్బుతం : ప్రారంభోత్సవం రోజే కూలిన 21 కోట్ల వాటర్ ట్యాంక్

అద్భుత కట్టటం అంటే ఇదే.. మహా అద్భుత వింత కట్టడం ఇదే.. అవును.. సూరత్ లో జరిగిన ఘటన చూస్తే.. గుజరాత్ ఇంజినీర్లు ఇంత పని మంతులా అంటారు.. జస్ట్ 21 కోట్ల రూపాయలను.. ప్రారంభోత్సవం రోజే కూలిపోయే విధంగా కట్టి.. ఈ దేశానికి అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు గుజరాత్ ఇంజినీర్లు.. ఈ మొత్తం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ ప్రాంతంలో ఒక వాటర్ ట్యాంక్ నిర్మించారు తాగునీటి సరఫరా కోసం. దీనిని ఒక ప్రతిష్టాత్మకమైన స్కీమ్ కింద దాదాపు రూ.21 కోట్లు వెచ్చించి నిర్మించారు. 33 గ్రామాలకు తాగునీరు అందించేందుకు దాదాపు 3 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ రాక కోసం వెయ్యి కళ్లతో అక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రోజున టెస్టింగ్ లో భాగంగా తొలిసారి వాటర్ ట్యాంకును నీళ్లతో నింపారు అధికారులు. అయితే అది ఒక్కసారిగా కుప్పకూలిపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 

ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు కార్మికులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన వాటర్ ట్యాంకును ఎంత నాశిరకంగా నిర్మించారో నిరూపిస్తోంది. తాడ్కేశ్వర్ గ్రాములో దాదాపు 15 మీటర్ల ఎత్తుతో కట్టిన వాటర్ ట్యాంక్ పగిలిన కుండలా కిందపడటానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి వాటర్ ట్యాంక్ కెపాసిటీ 11 లక్షల లీటర్లు కాగా.. పరీక్షలో భాగంగా 9 లక్షల లీటర్ల నీరు నింపగానే ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం నేలపాలైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

ALSO READ : యూపీలో నడి చెరువులో పడిపోయిన ఎయిర్ ఫోర్స్ విమానం

మెుదటిసారి నీళ్లు నింపగానే కూలిపోయేంత గట్టిగా కట్టారా ఆ వాటర్ ట్యాంక్ అంటూ సోషల్ మీడియాలో యూజర్లు ఎద్దేవా చేస్తున్నారు. దీనిని కట్టిన వారిలో ఎంతమంది బిలియనీర్లు అయ్యో అంటూ మరో యూజర్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. వీడియోలో ట్యాంక్ గోడల్లోని సిమెంట్ పీలికలుగా ఊడిపోవటం చూస్తుంటే దాన్ని ఎంత నాణ్యంగా కట్టాలో కనపడిపోతోందంటూ మరో యూజర్ పోస్ట్ చేశారు. 

దీనిపై తాడ్కేశ్వర్ గ్రామానికి చెందిన అబూ బకర్ అనే వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఒక్కసారి కూడా తమ ఇళ్లకు నీళ్లు సరఫరా చేయకమునుపే వాటర్ ట్యాంక్ కుప్పకూలటం తమ ప్రాంతంలోని ప్రజలకు ఆగ్రహానికి గురిచేసిందని చెప్పారు. తాము దీని కోసం దాదాపు 3 ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని అన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో క్రిమినల్ దర్యాప్తు స్టార్ట్ చేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. చవక ఇనుము, సిమెంట్ వంటి సామాన్లతో ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నారనే ఆగ్రహం పెరిగింది ప్రజల్లో. ఈ ప్రాజెక్ట్ జయంతి స్వరూప్ ఏజెన్సీకి ఇచ్చినట్లు డిప్యూటీ ఇంజనీర్ జై సోమాభాయ్ చౌదరి చెప్పారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కోసం శారదా వల్లభాయ్ నేషనల్ ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి నిపుణులైన స్ట్రక్చరల్ ఇంజనీర్లను నియమించినట్లు చెప్పారు.