అయోధ్యలో తోపులాట.. భారీ సంఖ్యలో భక్తులు

అయోధ్యలో తోపులాట..  భారీ సంఖ్యలో భక్తులు

బాలరాముడిని దర్శించుకునేందుకు అయోధ్యకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చలి తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ  తెల్లవారుజామునుంచే 3 గంటల నుంచే భక్తులు బాలరామున్ని దర్శించుకునేందుకు బారులు తీరారు.  ఈ క్రమంలో అధికారులు ఒక్కసారిగా  గేట్లు తెరవడంతో ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లారు. దీంతో భక్తుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సరైన సౌకర్యాలు లేక  భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. ఉదయం 7 గంటల నుంచి 11:30 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బాలరాముడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.  

అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం అంగరంగవైభవంగా సాగింది. ప్రత్యక్షంగా కొన్ని వేల మంది, పరోక్షంగా కోట్లాది మంది నీలమేఘశ్యాముడి వేడుకను తిలకించారు. పదకొండు రోజులుగా ఉపవాసదీక్షలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ క్రతువు జరిగింది. సాధువులు, కరసేవకులు, ప్రముఖులు, సామాన్యులు తరలివచ్చి ఈ సంబురంలో పాలుపంచుకున్నారు. 

దేశవిదేశాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. సాయంత్రం ఇటు అయోధ్యలోని సరయూ నదీ తీరంతోపాటు అటు దేశవ్యాప్తంగా గుడులు, ఇండ్లలో రామజ్యోతిని జనం వెలిగించారు.   ఐదేండ్ల లేత ప్రాయం.. నిగనిగలాడుతున్న నల్లటి మేను ఛాయ.. చేతుల్లో బంగారు విల్లుబాణాలు, ధగ ధగ మెరిసే స్వర్ణాభరణాలు ధరించి.. అద్భుతమైన ముఖ వర్చస్సుతో భక్తులపై చల్లని చూపులు ప్రసరించేలా ఉన్న బాలరాముడి దివ్యమనోహర రూపం చూపుతిప్పుకోని విధంగా ఉంది.

రాముడి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్‌కార్డు లాంటి ఏదో ఒక గుర్తింపు పత్రం తీసుకెళ్లాలి. హారతి కార్యక్రమానికి ఉచితంగానే పాస్‌ ఇస్తారు 

దర్శన వేళలు : ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు

జాగరణ హారతి : ఉదయం 6.30 గంటలకు (ఒక రోజు ముందుగానే అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది)

సంధ్యా హారతి: రాత్రి 7.30 గంటలకు (అందుబాటును బట్టి అదే రోజు బుక్‌ చేసుకునే సదుపాయం ఉంది)