తెలంగాణ విద్యుత్ శాఖలో భారీ స్కామ్ : లక్ష్మణ్

తెలంగాణ విద్యుత్ శాఖలో భారీ స్కామ్ : లక్ష్మణ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె. లక్ష్మణ్  సమక్షంలో మాజీ ఎమ్మెల్యేలు నందీశ్వర్ గౌడ్,  విజయపాల్ రెడ్డి, సదాశివపేట మునిసిపల్ మాజీ చైర్మన్ నామాగౌడ్ ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. తాము రాజకీయ పోరాటానికి రెడీ అవుతున్నామని.., కేసీఆర్ ను ఎదుర్కోవడం బీజేపీతోనే సాధ్యమని పలు పార్టీల కీలక నేతలు బీజేపీలో చేరుతున్నారన్నారు.

తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ అధికారులపై నెపం వేస్తున్నారన్న లక్ష్మణ్.. దేశంలో సమగ్ర విద్యుత్ విధానం రావాలంటూ కేసీఆర్ మరో కొత్త డ్రామాకు తెరలేపుతున్నారన్నారు. మోడీ చర్యలవల్లే 28 రాష్ట్రాల్లో సర్ ప్లస్ విద్యుత్ ఉందని, మోడీ వచ్చాక మారుమూల ప్రాంతాల్లో కూడా కరెంటు వచ్చిందన్నారు. తెలంగాణలో 24 గంటలు విద్యుత్ ఇస్తున్నారంటే కారణం మోడీయేనని అన్నారు

తెలంగాణ విద్యుత్ శాఖలో భారీ స్కామ్ జరిగిందని, ప్రభుత్వ నిర్వాకం వల్ల బ్యాంకుల క్రెడిట్ రేట్ తగ్గిందని లక్ష్మణ్ అన్నారు. “ కరెంటు బిల్ కట్టకపోతే సర్పంచ్ ని పీకేస్తానన్నావ్.. ఎన్నో సంస్థలకు బకాయిలు పడ్డ నిన్ను పదవి నుండి పీకేయాలా? సర్పంచులకు ఒక నీతి, కేసీఆర్ కు ఒక నీతా?” అంటూ  లక్ష్మణ్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణకు పలు పథకాలు ప్రకటిస్తోంటే… తెలంగాణ సర్కార్ అవేవీ అమలు చేయడం లేదని అన్నారు. రాష్ట్రంలో ఒక్క మెగావాట్ విద్యుత్ కూడా అదనంగా ఉత్పత్తి చేయలేదన్నారు. దేశంలోని ప్రజలందరికీ భారత రాజ్యాంగం ఉంటే మీకు మాత్రం కల్వకుంట్ల రాజ్యాంగం ఉన్నట్టుందంటూ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.