హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఇటీవల కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మాజీ ఆర్మీ మేజర్ ఇంట్లో నేపాలీ ముఠా దొంగతనానికి పాల్పడిన విషయం తెలిసిందే. చోరీ అనంతరం దేశం దాటిపోతుండగా హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. ఇదిలా ఉండగానే తాజాగా మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో ఇంట్లో భారీ చోరీ జరిగింది. మానస రెసిడెన్సీలో 102 ఫ్లాట్‌లో నివాసం ఉంటున్న వెంకటరమణ ఇంట్లో 50 లక్షల క్యాష్, 30 తులాల గోల్డ్ , 40 తులాల వెండి.. మొత్తం70 ల క్షల విలువ చేసే సొత్తు ఎత్తుకెళ్లారు దొంగలు.
వెంకటరమణ టూర్‌కు వెళ్లగా ఇంటి వెనక నుంచి తలుపులు పగలగొట్టి చోరీ చేశారు. నవంబర్ 25వ తేదీ చోరీ జరిగినట్లు చెబుతున్న కుటుంబ సభ్యులు నేపాల్‌కు చెందిన వాచ్మెన్ అర్జున్‌పై అనుమానం వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్లో ఐదు నెలలుగా వాచ్మెన్ పని చేస్తోన్న అర్జున్ దొంగతనం జరిగిన రోజు నుంచే కనిపించకుండా పోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మలక్ పేట్ పోలీసులు. ఈ సందర్భంగా నేపాలీ వ్యక్తులను పనికి పెట్టుకునే క్రమంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

