- ఇప్పటి వరకు 55 ఇండ్లలో దొంగతనాలు..
- జైలుకు వెళ్లొచ్చినా మారని తీరు
- పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిండు
- ఎట్టకేలకు అరెస్ట్ చేసిన మియాపూర్ పోలీసులు
మియాపూర్, వెలుగు: అతనో ఘరానా దొంగ.. ఇప్పటి వరకు మూడు కమిషనరేట్ల పరిధిలో 55 దొంగతనాలకు పాల్పడ్డాడు. గతంలో జైలుకు వెళ్లివచ్చినా తీరు మార్చుకోకుండా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఇటీవల మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో.. ఎట్టకేలకు ఆ గజదొంగ మియాపూర్ పోలీసులకు చిక్కాడు. కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ శుక్రవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు.
ఫిర్యాదు అందింది ఇలా..
ఈ నెల 21న మాతృశ్రీనగర్‌లోని అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న మంజుల ఇంట్లో మధ్యాహ్నం సమయంలో ఓ వ్యక్తి చొరబడి వెండి ఆభరణాలు దొంగిలించాడు. మంజుల ఇచ్చిన ఫిర్యాదుతో మియాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఇదే పద్ధతిలో గతంలో కూడా మియాపూర్‌లో రెండు దొంగతనాలు జరగడంతో పోలీసులు నిందితుడిపై నిఘా పెట్టారు. శుక్రవారం మియాపూర్ పరిధిలోని మయూరినగర్లో స్కూటీపై అనుమానాస్పదంగా సంచరిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.
వాచ్మెన్ ఇండ్లే టార్గెట్..
నెల్లూరు జిల్లా కావలి మండలం చమడాల గ్రామానికి చెందిన వల్లేపు వెంకటేష్ (28) ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. చదువు మధ్యలోనే ఆపేసి కూలీ పనులకు వెళ్లేవాడు. నగరానికి వచ్చి మియాపూర్ ఎఫ్‌సీఐ కాలనీ సమీపంలో నివాసం ఉంటూ.. ఇసుక బిజినెస్ చేసే ఓ వ్యక్తి వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాడు. వచ్చే డబ్బు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు.
సాధారణంగా దొంగలు ధనవంతుల ఇండ్లను ఎంచుకుంటారు కానీ, వెంకటేష్ మాత్రం అపార్ట్మెంట్లలో ఉండే వాచ్మెన్ ఇండ్లను లక్ష్యంగా చేసుకున్నాడు. ముందుగా రెక్కీ నిర్వహించి, ఎవరూ లేని సమయంలో చొరబడి దొంగతనాలు చేసేవాడు.
దొంగిలించిన సొత్తును తెలిసిన వారికి అమ్మేసి, వచ్చిన డబ్బుతో బెట్టింగ్‌లు కాయడం, జల్సాలు చేయడం ఇతని అలవాటు. 2013లో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొదటిసారి దొంగతనం చేశాడు. ఆ తర్వాత 2015 నుంచి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాలకు పాల్పడుతూనే ఉన్నాడు.
50కి పైగా కేసులు..
వెంకటేష్ మూడు కమిషనరేట్ల పరిధిలో 50కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని డీసీపీ తెలిపారు. మాదాపూర్‌లో 16, కేపీహెచ్‌బీలో 5, మియాపూర్‌లో 3 కేసులు ఉన్నాయి. ఏపీ, ఇతర జిల్లాల్లో కూడా ఇతనిపై కేసులు ఉన్నాయా అని ఆరా తీస్తున్నామన్నారు. ప్రస్తుతం మియాపూర్‌లోని మూడు కేసులు, గచ్చిబౌలిలోని ఒక కేసులో అతడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 3.50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతోపాటు స్కూటీని సీజ్ చేసుకున్నారు.

